పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

   నేను మాషాద్  పట్టణాన్నుంచి ఇంకో పారసీక మహాకవి  పుట్టి నివసించిన  ప్రదేశం చూద్దామని టస్  నగరం  చేరుకున్నాను.  టస్  నగరం ' అవెష్టా ' పారశీక మతగ్రంథమంత  పురాతనం. ఆ  పవిత్ర  గ్రంథములో ఉన్న తుపా మహానాయకుడు. అతడు  తురాన్  దేశవిజేత. ఆయనే  ఈ నగరం దర్శించాడు. మంగోలులీ నగరాన్ని  పూర్తిగా  ధ్వంసం చేశారు. కాని నేడు  ఎంత  శిధిలమైవున్నా, పిరదౌసీ  మహాకవి  ఈ  నగరంలో  జన్మించిన కారణాన ఈనాటికీ ఈ ప్రదేశం  లోకానికంతకూ  పవిత్రం. అయింది.
   ఒమారు ఖయ్యాం మహాకవి  అని పారశీక ప్రజలకు  తెలియకపోవచ్చును గాని  పిరదౌసీని యెరుగని  పారశీకుడొక్కడైనా లేడు. నన్నయ్య, తిక్కన్న, పోతరాజులను ఎలా  సర్వాంధ్రులు పూజిస్తారో అలాగే  పిరదౌసీని ఇరానీయులు పూజిస్తారు. పిరదౌసీ  క్రీ/శ 935సంవత్సరంలో  టస్ నగరంలో జన్మించాడు. 1025లో అక్కడే  చనిపోయాడు. బ్రతికివున్న 90సంవత్సరాలలో  అనేక  సుఖాలు, కష్టాలు, జీవిత విజయాలూ, దుర్గతులూ అనుభవించాడు. గౌరవమూ, అగౌరవమూ పొందాడు. ఆ  మహాకవి  ప్రపంచోత్తమ  గ్రంథాలలో షానామా అనే  ఉత్కృష్ట కావ్యాన్ని రచించాడు.
   పిరదౌసీ అంటే 'స్వర్గధామం' అని  అర్థం. ఈతడు అత్యంత పురాతనమైన  ఇరానియన్ వంశాలవాడు. అరబ్ సంస్కృతిని  టస్ నగరమూ, ఇరానూ భరించలేక  పోయింది. దేశం  అంతా  తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటు యొక్క  దీప్తకంఠమే పిరదౌసీ. ప్రాచీన  వీరుల ధీరోదాత్తత, మా దేశం గొడ్డుపోలేదన్న  దేశభక్తి  అకుంఠితమై, మహాగంభీరమై  అతని వాణిలో ప్రవహించింది. ఈ  ధీరగాథాలాపనంలో ఈతని  పూర్వీకుడు  డకీకి కవి. కాని  టుర్కోమాన్ హంతకుడొక డాతని ప్రాణం దొంగబాకుకుగురి చేశాడు. ఆ డకీకి కవి  స్వప్నంలోవచ్చి  తాను  ప్రారంభించిన పని  పిరదౌసీని సంపూర్ణం  చేయమని  కోరినట్లు పిరదౌసీ  చెప్పుకున్నాడు


   జరాతృష్టుని  గూర్చి వేల పద్యాలలో పాడిన డకీకి కవిత్వం తన 'షానామా' లో పిరదౌసీ చేర్చుకున్నాడు. ఈ  గ్రంథం ప్రారంభించేసరికి  పిరదౌసీకి 40ఏళ్ళున్నాయి. ఒక్క  కొడుకూ పోయాడు. ఆ  విచారగానమూ  ఈ  ఉత్కృష్ట కావ్యంలో  శోకరాగాలు పాడుతుంది. ఒక్క కూతురు అతని  జీవితాంతంవరకూ  పరిచర్యచేస్తూ  బ్రతికివుంది. ఈ  మహాకావ్యం తలపెట్టి  పిరదౌసీ  గజనీ  మొహమ్మదు  రాజసభకుపోయి  అక్కడ  సభారత్నమై అరవై వేల ద్విపదలుగా షానామా  రచించాడు.  ఆ