పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాస్త్రజ్ఞాన పిపాస సమానం. దివ్యధర్మమైన కళాతృష్ట సమానం. ఇంక మార్గాలు దేశ కాల పాత్రలనుబట్టి వేరవుతాయి. కొన్ని నదులు ఉత్తర సముద్రాలలో, కొన్ని తూర్పు సముద్రాలలో, కొన్ని దక్షిణ సముద్రాలలో, కొన్ని పడమటి సముద్రాలలో లయమౌతున్నవి. కొన్ని నదులు మహాసరస్సులలో లయమౌతున్నాయి. ఈనాడు సరస్వతీనది భూమిలోనే ఇంకిపోతున్నవి. అలాగే ప్రజాజీవిత ప్రవాహాలున్ను.

    స్వామీ! చోరుల జీవితం  కూడా  ఉత్తమమేనా? 
    దొంగలు  నాల్గురకాలు. ఒకడు  తిండిలేక దొంగతనం చేస్తాడు. ఒకడు తిండి ఉండి లాభం కోసం  దొంగ అవుతాడు. మరొకడు దొంగతనం జబ్బులవల్ల చేస్తాడు. ఇంకోడు మంచి చేస్తున్నాననుకొని  దొంగతనం చేస్తాడు. ఇంకోణ్ణి   చంపడానికి వచ్చే మనుష్యుని చేతిలోని ఆయుధాన్ని, అతనికి తెలియకుండా  దొంగతనం చేస్తాడనుకో! దానివల్ల ఒక ప్రాణం  రక్షించినవాడయ్యాడుకదా? అది మంచిదా  చెడ్డదా?  కనుక  ఇవన్నీ  మనం  సమన్వయం  చేసుకోవడంలో ఉంది. కారణంలేని  సంఘటన  ఏమీ  ఉండదు. అయినా  సమ్యక్  దృష్టి కలిగిన  ప్రతివాడూ జీవితంయొక్క సర్వధర్మాలు  గరుడని చూపులతో  చూడాలికదా! 
   నేను మౌనం  వహించి  స్వామి  మాటలలోని  అంతరార్థం  గ్రహించుకుంటూ  కూచున్నాను.
   మా  అమ్మగారికి  నేను  పాశ్చాత్య దేశాలు  వెళ్ళటం ఇష్టంలేక  పోయింది. స్వామీజీ  ఆమెను  సమాధాన  పరచారు.
   1915 అక్టోబరు నెలలో  బయలుదేరి  నేను  బొంబాయిమీదుగా ఓడమీద  ప్రయాణమై బాస్రా చేరుకున్నాను.  పర్షియా దేశము, మెసపొటేమియా మందు  చూచటం ముఖ్యమనుకున్నాను.  పర్షియా  నేటి  ఇరాను, పూర్వకాలపు పారశీకము; భరతదేశంలో  అత్యంత పురాతన కాలం  నుండీ  గాఢ సంబంధాలు  సంపాదించుకున్నది.
   వేదకాలంనాటి  అసురదేశము, పురాణకాలంనాటి గాంధారము అది. ఈ దేశానికీ, ఆంధ్రదేశానికీ  ఏదో  సంబంధం  ఉంది. ఈ  రోజున  ఆంధ్రులు  అయిసరమజ్జా అని  అంటూంటారు. అది  అహురమజడా  యొక్క  మారురూపమేమో, ఇవన్నీ నా  విపరీతాంధ్రత్వంలోని  వెఱ్ఱికొమ్మలని స్వామీజీ నవ్వుతూ అనేవారు. నేను  నా వాదన  నిజమనేవాడిని.  నిజమయి ఉండవచ్చునని స్వామీజీ  అన్నారు.
   బాస్రాలో దిగి, బాగ్దాదుపోయి,  అక్కడ  మకాం  పెట్టుకొని, టైగ్రీస్, యూఫ్రెటీస్ నదీ తీరాలలోనూ,  దూరంగావున్న ప్రాచీన  సుమేరు దేశ, చాల్డియన్దేశ,  అసురదేశ  మహాసిల్పాలన్నీ చూచాను. ఎన్నో శిల్పాలు  యూరపుఖండ రాజ్యప్రదర్శనశాలల్లో  అమెరికా  ప్రదర్శన శాలల్లో! టర్కీ ప్రదర్శనశాలలోనూ వున్నాయి.