పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆమెలో రెండు అందాలు మేలుకలయిక పొంది, ఆమెకు దేవ గంధర్వ సౌందర్యము ప్రసాదించాయి. ఆ బాలికకు ఇంగ్లీషు బాగా అర్ధం అవుతుంది. కాని తాను నట్టుతూ మాట్లాడుతుంది. భారతీయ శిల్పంలోని రహస్యాలు వాళ్లకు పూర్తిగా తెలియవు. వాన్ అయికు, నాన్ డైక్ మొదలయిన చిత్రకారుల రక్తమూ, ఆంధ్రశిల్పుల రక్తమూ, యవద్వీపవాసుల రక్తమూ ఆమెలో సంయోగం పొంది, భారతీయ శిల్పం అంటే ప్రేమను కలిగించాయి. అది వట్టి అలంకార శిల్పంమాత్రం అనే భావాన్ని కలుగజేశాయి. ఈ రెండు భావాలు ఒక్కొక్కప్పుడు శ్రుతి అవుతాయి. ఒక్కొక్కసారి అపశ్రుతిగా తుపాను పుట్టిస్తాయి. విల్హె ల్మినాతోను, ఆమె తండ్రితోనూ నేను మూడు రోజులు వాధించాను, బోధించాను. విల్హె ల్మినా నా వాదన పూర్తిగా అర్థంచేసుకొని భారతీయశిల్పం నేర్చుకోవడానికి సంకల్పించుకొంది. నేను వారితో జావాలోని తక్కిన శిల్పక్షేత్రాలన్నీ తిరిగాను.

   బోరోబదూరునుంచి మేము  ప్రాంబనాన్ వెళ్ళాము.  ఈ గ్రామం  సురకర్త  నగరజిల్లాలో ఉన్నది. యోగ్యకర్త నగరానికి  సమీపం. రెంటికీ రైలుమార్గం వుంది. ప్రాంబనాన్ అంటే  గురువులున్న  గ్రామం అని అర్థమట.  ఈ  మహాగ్రామంలో  157 చిన్న  గుళ్ళు మూడు  కక్ష్యంతరాలలో  వున్నాయి. లోని  కక్ష్యంతరంలో  ఆరు పెద్ద  గుళ్ళు వున్నాయి. మధ్య దేవాలయం  శివపార్వతులది,  శివుడు  జగద్గురువుగా, మహాకాలుడుగా  విగ్రహాలున్నాయి. దుర్గ, గణేశ విగ్రహాలున్నాయి. బ్రహ్మవిగ్రహమూ, విష్ణువిగ్రహాలూ ఉన్నవి. ఇక్కడ శిల్పం  ప్రథమ  ఆంధ్ర  చాళుక్య  శిల్పాన్ని  పోలి  ఉంది. ఈ  విగ్రహాలలో  ఎల్లోరా,  మహాబలిపుర  విగ్రహాలలోని, విజయవాడ గణేశ  విగ్రహాలలోని  మహోన్నత శక్తి,మహాప్రజ్ఞాత్మిక రచన  దృశ్యమౌతున్నది.
   అక్కడినుండి  చండిజాగో, విష్ణువర్ధన చాళుక్యుడు నిర్మించిన  గుడికి  వెళ్ళినాము. చండి  అంటే  గుడి. ఇక్కడి శాసనాలు  దేవనాగరలిపిలో  ఉన్నాయి.  ఇక్కడ  మకరతోరణాలు లేవు. గాంధర్వశిల్పంతో  మిళితమైన  భారతీయశిల్పం  దృశ్యం  అవుతుంది. చండీజాగో దగ్గరనే  సింగోస్సారి చండి, కిదాల్ చండి, జాబుంగ్  చండీలు  ఉన్నాయి.
   వీటి అన్నిటికన్న ఉత్తమమైన  దేవాలయం  కేదిరి చండి. ఇచ్చట  శిల్పం అత్యంత లాలిత్యం  చేకూర్చుకొని యవద్వీప వాసనలు రూపం  తాల్చింది. ఈ దేవాలయాలన్నీ  తూర్పుజావాలో  ఉన్నాయి. ఈలాంటి  దేవాలయాలు  యవద్వీపం అంతా  నిండి  ఇక్కడకు పూర్వభారతీయులు ఎంత విరివిగా  వలస  వచ్చేవారో  తెలియజేస్తున్నవి. అనేక శిల్పాలు  హాలెండు, జర్మనీ  మొదలయిన  ప్రదేశాలకు  తరలించుకుపోబడినాయి. పాశ్చాత్యులు  ఎవరికి  తోచినరీతి వారు  చరిత్రలు రాసారు.