పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రజ్ఞాపారమిత శిల్పము జగత్ప్రక్యాత శిల్పాలలో ఒకటి. ఆమెను నేను ప్రేమించాను, పూజించాను.

   ఈ రోజులలో  స్త్రీ  భావాన్ని  పూజింపసాగాను.  అందమైన స్త్రీ, మధురకంఠి.  విలాసాలప్రోవు.  వీరందరూ  నా  శకుంతలలోని  ఛాయలయ్యారు. ఏ  సౌందర్యోజ్వల స్త్రీ  అయినా  నాలో  కామేచ్ఛ ఏమాత్రమూ వుద్భవించలేదు.  ప్రకృతిసౌందర్యదర్శన  పులకితుడై, పరవశత్వం చెందే సౌందర్యోపాసిలా  స్త్రీ  సౌందర్యోపాసినిమాత్రమయ్యాను. జగత్ స్త్రీ! ఎంత విచిత్రమైన  భావం. వివిధ  సౌందర్యాత్మకమయిన  పరమ  శబలత్వ మోములో  మూర్తీభవిస్తుంది. ఏ  సీమలో  ఆమె  నర్తిస్తుందో  ఆ సీమలోని  సౌందర్యాలన్నీ  పూలలా ఏరి  తన్నలంకరించుకొంటుంది. ఏ కాలంలో  తాను నాయిక  అవుతుందో,  ఆ కాలంలోని సౌందర్యాలు పరిమళాలు చేసి తాను సుభిక్ష అవుతుంది. సామ్రాజ్య భావపూర్ణ స్త్రీలో  ఆడపులి  అందాలు  చూస్తాము.  భారతీయ  కాంగ్రెసులో వంగోలుసీమ ధవళ  దేనువులు  దర్శిస్తాము. సోవియట్  రష్యాలో పొలందున్నే బాడబి కన్నుల  విందు చేస్తుంది. కాటకంలో కడుపు వెన్నెముక  కంటుకుపోయి,  ఎముకలపోగై  చంటిబిడ్డకు  పాలులేక, వేలాడే పాలతిత్తులు వడలిపోయిన  భీభత్సంలో  కాటకసుందరి. ఆ  తల్లే  మనుష్యులలోని సర్వకరుణలు స్పందించి అతణ్ణి కర్మవీరుణ్ణి చేస్తుంది. బర్మాలో, సింగపూరులో,  మంగోలియనుజాతి స్త్రీ  సౌందర్యాన్ని నేను దర్శించాను. ఉత్తమస్థితిలో స్త్రీలు  బర్మాలో చుట్టాలు కాలుస్తారు. ఆమెదే నిజమైన బర్మా పరిపాలనం. ఆమె సర్వసంస్థలకు  దానధర్మాలు చేసే వ్యక్తి. అలంకారంలో ఆమె ముందు. సంగీత మామే సొత్తు. నాట్య  మామే హక్కు.  చదువులో ఆమెది  మొదటి పంక్తే! భారతదేశంలో  వెనక ఎలా  సరస్వతి, శారద, గజలక్ష్మి, మందాకినీ, భూమాతా, పౌష్యలక్ష్మి, విద్యుల్లతాంగీ అయి స్త్రీ  వున్నదో, జావాలోనూ ఆమె  అలా  ప్రజ్ఞాపారమిత అయింది.  జావాకు  వలస  వచ్చిన  భారతీయులచే   ఆ  ప్రజ్ఞాపారమితాదేవే సకల  సంస్కృతీ విలసింపజేసింది.
   ఆ భావాలతో  బోరోబదూరు  శిల్పలక్ష్మికి  సాష్టాంగపడ్డాను. సాష్టాంగమునుండి లేచి నిలుచుండగానే డచ్చిభాషలో నన్నొక  యవదీపపాశ్చాత్యసుందరి  మీరు భౌద్దులా? అని పల్కరించింది. నాకు డచ్చిభాష రాదు. యవద్వీప భాషా రాదు. నేను  తెల్లపోయి  ఇంగ్లీషులో  నాకు  మీ భాష రాదు  అని  జవాబు  చెప్పాను. ఆ బాలికతో  వున్న  ఒక పెద్ద  డచ్చి  దేశస్థుడు  మీది హిందూ దేశమా?  అని  ఇంగ్లీషులో ప్రశ్నించాడు.  ఆ  డచ్చి  పెద్దమనుష్యుడు నన్నట్లు పలకరించగానే నాకు ఎంతో  గర్వం కలిగింది.