పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాటలు నాకు వివశత్వం కలిగించాయి. ఎంతో మహోన్నత భావాలు. నాయికా నాయకులు జానపదులు. ఎంకి ఒక దేవతే! వారింటిదగ్గరే నండూరి సుబ్బారావుగారి వేలువిడిచిన అన్నగారు భావరాజు సుబ్బారావు గారిని కలుసుకున్నాను. ఆయన కొవ్వూరు సంస్కృత పాఠశాలా కులపతిత్వం వదలి సత్యాగ్రహంచేసి జైలుకువెళ్ళివచ్చారు. ఆయన మహా పండితుడు, ఉత్తమకవి, నాకు కవిత్వాన్ని గురించి, శిల్పకళను గురించి యెన్నో మహత్తర విషయాలు బోధించారు.

   విశ్వనాథ సత్యన్నారాయణగారు  మహాకవి  శిరోభూషణుడు. ఆయన ప్రతిభ శాంత మహాసముద్రము వంటిది. ఆయన  ధార శివసముద్ర కావేరీ జలపాతంవంటిది. ఆయన  మహాకావ్యాలను  సృష్టించగలరని నేనాశించాను. గుంటూరులో  తల్లావఝలవారిని దర్శించాను. ఆంధ్రదేశంలో కవుల  నందరినీ  ఒక సంస్థగా  చేయాలని  ఆయన  ప్రయత్నం. ఆయన సకల భాషావేత్త, మహాపండితుడు, అఖండకవి. ఆయన్ని చూస్తేనే కవిత్వం ఉద్భవిస్తుంది. ఆయన  శిల్పమూ  నేర్చుకున్నారు. రామిరెడ్డిగారినీ, బసవరాజు అప్పారావుగారినీ కలుసుకున్నాను. బసవరాజువారు ఒక మహాసంస్థ. ఆయన అతి  తీయగా పాడగలడు. ఆయన పాటలు  సర్వవిధాలా క్షేత్రయ్యను జ్ఞాపకం  చేస్తాయి. రామిరెడ్డిగారి కవిత్వం  తీయటిధార. అద్వితీయ ప్రతిభ. ఆయన  బాణి ఆనందవాణే! ఈయన్ను  చూచి  శ్రీకృష్ణదేవరాయుణ్ణి తలుచుకున్నాను.                                                                           

ఈ కవుల తర్వాత నాకు ఎక్కువ సన్నిహితం అయినవారు కురుగంటి సీతారామయ్యగారు. ఈయన తంజావూరులో పూడిపోయిన ఆంధ్రకావ్య మహాసంస్కృతిని బయటకు తీస్తున్నారు. వీరి పాండిత్యం అప్రతి మానము. వీరితో ఉజ్జీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు. ఆయన స్నేహంలో చిన్నబాలుడు. వీరు ఎన్నో మహత్తర గ్రంథాలు తెలుగులోనికి అనువదించారు. వీరిద్దరూ రెండు హిమాలయ శృంగాలు.

   ఆ  రోజుల్లోనే ఏదో  కారణంవల్ల బందరు  వచ్చిన  వేటూరి  ప్రభాకరశాస్త్రిగారిని దర్శించాను. ఆయన మహాకవే, ఉద్దండపండితుడే. అంతకన్న  ఆయనలోని  ఏదోశక్తి ఆయన్ను అపర  నాగార్జునాచార్యునిలా  కనిపింప చేసింది, నా కథంతా  ఆయనకు  నివేదించాలని ఏదో ఆవేదన కలిగి  మనవి చేశాను. ఆయన  నాయనా! నీ శకుంతలను నువ్వు  ఇంకో రూపంలో కలుసుకుంటావు. ఏమీ  సందేహంలేదు. మీ గురువుగారు చెప్పిన  మాటలన్నీ నిజంఅన్నారు.
   గుంటూరులో  శారదానికేతనం అని  బాలికా  జాతీయ  విద్యాలయం  ఒకటి వుంది. అది స్థాపన  చేసినవారు  పురాణ దంపతులైన  లక్ష్మీనారాయణుల  వంటి  లక్ష్మీనారాయణులు. ఉన్నవ లక్ష్మీబాయమ్మగారూ, వారి భర్త  ఉన్నవ లక్ష్మీనారాయణగారున్ను  ఈ ఉత్తమ విద్యాలయం  స్థాపించారు. లక్ష్మీనారాయణగారు బారిస్టరు. గాంధీ మహాత్ముని  సత్యాగ్రహ సమరంలో  వృత్తిమాని జైలుకువెళ్ళి, జైలులో  మాలపల్లి అనే నవల  వ్రాశారు.