పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నువ్వూ, అత్తగారూ వచ్చిన దగ్గర నుంచి కాస్త ఆమాత్రంగా ఉంది. మా మరదలూ, తోడల్లుడూ విషయం నేను చెప్పలేనుగాని, నీ ఆస్తిలో మీ పెద్దక్కకు సంబంధించినంత మట్టుకు ఒక్క సెంటుభూమి ముట్టుకోదు. ఆ మాట తెచ్చావా మళ్ళీ మూర్ఛలు, హిస్టీరియా ప్రారంభం అవుతాయి అని కొంచెం సన్నసన్నాగా చివాట్లు పెట్టాడు.

పెద్దబావా! నరసారావు పేటలో మా చిన్నక్కా, చిన్నాబావా కూడా నన్ను చివాట్లు పెట్టి వదిలారు. మనం సావకాశంగా కూర్చుని మాట్లాడుదాం బావా! నువ్వు వకీలువు, నీ సలహా నాకు పూర్తిగా కావాలి అన్నాను.

   బందరులో  ఉన్న రోజులలో  కృష్ణాపత్రికకు వెడుతూ, కృష్ణారావుగారితో  మాట్లాడుతూ ఉండేవాడిని.  ఆయన భారతీయ  శిల్పాన్ని గురించి నాకు పండు ఒలిచినట్లు చెప్పారు. రోజూ వారపత్రిక ఆఫీసులో దర్భారు  జరుగుతూ  వుండేది. వారు  గాంధీతత్వాన్ని గూర్చీ, శంకరవేదాంతము  అరవిందవేదాంతము సమన్వయంచేసి  వెండిపళ్ళెంలో మల్లెపూవు  పేర్చినట్లు చెప్పారు. ఆయనా  జైలుకువెళ్ళివచ్చారు. బంగారుఛాయ, బలమైన స్థూలకాయం, విశాలమైన  కాటుకకళ్ళు, గరుడనాసిక,  గాభీరమైన  ఫాలము, కోర తలపాగా, యవ్వనుని  వుత్సాహమూ,  మహాఋషికున్న జ్ఞానమూ, దేశభక్తీ  ఆంధ్రులలో మకుటాయమానమైన మనిషి. సభలలో  మాట్లాడరు.  మాట్లాడితే  గోముఖసంభవదివ్య  గంగాఝరీవేగమే! విడిగా స్నేహితులందరూ కూడిన  సాయంకాలంలో  చిన్నబిడ్డవలె అల్లరీ  చేయగలరు, యువకునిలా వుత్సాహమూ  ప్రకాశింపచేస్తారు. మానససరోవరనీలజలస్నిగ్థత, కైలాస పవిత్రపర్వత మహోన్నతి తమ  మాటలలో  చూపిస్తారు. ఆయన  కృష్ణాపత్రికలోని  సంపాదకీయ వ్యాసాలూ  ఆంధ్రదేశానికి భాష నేర్పాయి. నవ్య  సాహిత్యపరులకు దారి చూపించాయి.  వారి సభలో  కైలాసము, త్రివిష్టపం, ఆయా దేశాల కళలు, ఆచారాలు, సంస్కృతీ  అన్నీ  మనవి చేశాను. ఇవన్నీ రెండు  మూడు వ్యాసాలుగా వ్రాసి  తమ పత్రిక  కిమ్మని వారు నన్ను కోరారు. అది ఆజ్ఞగా  శిరసావహించాను.
   కృష్ణపత్రిక  ఆఫీసులోనే  పట్టాభి  సీతారామయ్యగారిని దర్శించాను. మేధాసంపన్నత్వంలో  కుబేర   వైభవానికే  అప్పిచ్చే  అఖిల  భారతీయ  ప్రఖ్యాత  పురుషు డీయన.  ఈయన  జ్ఞాపకశక్తి  ఒక  పరమాద్భుత  సంఘటన. చిన్నతనాననుండి ఆయన  తెలుసుకున్న  రాజకీయ  విషయాలు,  తేదీలు పేరులతో సహా  జ్ఞాపకం. ఏ  విషయమైనా  హృదయానికి  హత్తుకునేటట్లు చెప్పగలరు. కాని మన  సంభాషణ  ఆయనకు  చప్పగా  వుంటుంది. అడిగే ప్రశ్నలూ చప్పగా  వుంటాయి. అందుచేత  ఆయనే  సంభాషణ   ఎత్తుకునేటట్లు  చేయాలి.