పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బావ: అది పల్నాడు తాలూకారా! పైగా ఆ శిల్పాలను బాగా ఉంచే బాధ్యత అఖిల భారతీయ ప్రభుత్వం వారిదిగాని మాకేమీ సంబంధములేదు.

   నేను: బావా!  నీ తాలూకాలో  పూర్వకాలంనాటి  విగ్రహాలు  ఏవైనా  అమ్మకానికి  ఉంటె  చూద్దూ! పాతనాణేలు  కూడా  వదలకు.
   బావ: ఒరే శ్రీనాథం!  నీకు మొన్న  కలకత్తా ప్రదర్శనంలో పదివేలు  వచ్చాయటగా?
   నేను: డబ్బు  సంపాదించడం ఎంత సేపు  బావా! దేశానికీ, జాతికీ సేవ  చేయాలిగాని!
   బావ: గొప్ప  మానవ  సేవకుడవు దొరికినావు! నిన్నూ, నీ కుటుంబాన్నీ పోషించుకొని, ఇతరులను  బాధించకుండా ఉంటే, అదే  దేశ సేవా, మానవసేవాను.
   చిన్నక్క : కాస్తమాటంటే ఏవో  పెడర్ధాలు చేసుకొని ఉడుకుబోతుతనం పడతారెందుకండీ?  
          
   బావ: నాకా  ఉడుకుబోతుతనం, నీకా?  నీ తమ్ముడు  చిన్నారి చిట్టీ, బుల్లాలకూచీ అనుకున్నావా?
   మా బావ పకపకా  నవ్వారు. మా చిన్నక్కకు చాలాకోపం వచ్చింది.
   చిన్నక్క: ఎందుకండీ  ఆ నవ్వు? మా తమ్ముడు  వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాను. వాణ్నీ ఒక్కరీతిగా  దులిపిపోస్తున్నారు!
   బావ: ఓసి  నీ  వెఱ్ఱి కాలా! వాణ్ని  నేనేమంటున్నానే!  నాకు  మా బావమరిది  గొప్ప  చిత్రకారుడూ, శిల్పీ అంటే గర్వం లేదనుకున్నావా? కాని  నా ఆపేక్ష  కొద్దీ నాలుగు  ముక్కాలు  సలహా  చెప్పాను. నీ  కెందుకూ అంత కోపం?
   యింతట్లో మా అమ్మ  గుమ్మం  చాటుకు  వచ్చి, అల్లుళ్ళ ఎదుటపడి  మాట్లాడే  అలవాటు  లేదు కాబట్టి, చాటునుండే   అమ్మడూ!  అల్లుడుగారు  మాత్రం  ఏమన్నారు? ఒక్కడే బావమరిది  అవడంచేత ఏదో  సంసారం  నిలబెట్టమనీ, దేశాలుపట్టి పోవద్దనీ చెప్పారు. అంతకన్న వారేమన్నారు?  అన్నది.
   ఓహోహో  శ్రుతిమించి రాగాన  పడుతోంది  అని ఆలోచించుకొని  బావా  నేవు చెప్పిన  మాటలూ బాగున్నాయి!  అక్క  అన్న  మాటల్లోనూ తప్పులేదు. అమ్మా బాగానే  చెప్పింది. నేను స్వామీజీని  నమ్ముకున్నాను. వారు ఎలా నాకు  సలహా  ఇస్తే  అలా చేస్తాను. మీరెవ్వరూ ఏమీ దిగుళ్ళు పెట్టుకోవద్దు  అన్నాను.
   బందరు వెళ్ళినప్పుడూ  ఇల్లాగే  వచ్చింది సభాషణ.  మా పెద్దబావ  నేను వెళ్ళిన  రాత్రే, నన్ను తన ఆఫీసుగదిలోకి పిలిచి  ఒరే శ్రీనాథం! ఏమిటి నీ ఉద్దేశం?  పోయినవాళ్ళను బ్రతికించుకోలేము. శకుంతల అచ్చంగా  దేవతే!  నువ్వు మళ్ళీ ఒక  ఇంటివాడవైతే, ఆ దేవి  ఎంతైనా  ఆనందపడుతుంది. నువ్వు మళ్ళీ హరిద్వారం అత్తగారితో  కలిసి  వెళతానంటున్నావు.ఆస్తి  అంతా  కంగాళీచేసి   వదిలావు. మీ పెద్దక్కకు  నువ్వు  రాసిన భూమి, ఏమీ  పుచ్చుకోను  పొమ్మంది. నువ్వు  ఏమనుకున్నావో  ఏమోకాని, నువ్వు అల్లా  పత్రం  రాసి  రిజిస్టరీ పంపించిన మర్నాటి నుంచీ  నెలలు, నెలలు  తలుచుకొని  ఏడుస్తూవుండేది.