పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హేమ త్వరగా స్నానాదికాలు నిర్వర్తించి, భోజనాల ఇంటిలోనికి వెళ్ళి రెండు ఇడ్డెన్లూ, పెసరట్టు ఒకటీ ఆరగించి, కాఫీ తాగి తన స్వంత పరిచారికకు తాను పదిగంటల వరకూ ఎవ్వరికీ కనబడనని చెప్పి, తన చదువు గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ రేడియో పెట్టుకొని రికార్డు సంగీతం వింటూ మనస్సులోని ఆలోచనలు పరిపరివిధాల పోతూవుండగా, త్యాగతి కథ తీసిది. వెనుకటి పేజీలు మళ్ళీ ఒకసారి తిరగ వేసింది. చదవడం ప్రారంభించింది.

                                                     సౌందర్య దీప్తి

మా చిన్నక్క మా అమ్మపోలిక. కొంచెం నాజూకైన అమ్మాయి. నాకన్న మూడు నాలుగేళ్లమాత్రం పెద్దదిలా కనబడుతుంది. వడవడ వాగుతుంది. పదిమందితో కలుపుకు తిరుగుతుంది. అందరికీ తల్లోనాలిక. అందరి వ్యాపారాలూ తనకే కావాలి. తన వ్యాపారాలందరికీ కావాలి. రహస్యం దాచుకోలేదు. భర్త తహసిల్ దారునిపని చేస్తున్నాడు, ఇంకేమీ! ఆవిడ దర్జాకు ఏమీ లోటులేదు. మా చిన్నక్క పేరు అలివేలులక్ష్మి. ఆవిడకు యిద్దరే బిడ్డలు. ఇద్దరూ కొడుకులే! కూతురు కోసం సరదాపడి ప్రతి అమ్మవారికి మొక్కుకుంటుంది. మా పెద్దక్కయ్య రెండోకూతురును మా చిన్నక్కయ్య తెచ్చుకొని పెంచింది. ఆమె పెండ్లికి పీటలమీద బందరులో తానూ తన భర్త కోటేశ్వరరావుగారూ కూర్చున్నారు.

   ఆమె ఇద్దరి కొడుకులలో  పెద్దవాడు  స్కూలు ఫైనలు చదువుతున్నాడు. రెండవవాడు తర్డుఫారం చదువుకుంటున్నాడు. మా పెద్దబావగారైన కలపటపు మధుసూదనరావుగారు నేనంటే  ప్రాణం  ఇచ్చేవారు.  మా  చిన్నబావ  దావులూరి  కోటేశ్వరరావుగారు మాత్రం  నాకు  సర్వకాలం నీతులు  బోధించడం, చివాట్లు పెట్టడం సాగించారు.
    ఒరే బావా! లక్కరాజువారి వంశానికీ, శేషాచలపతిగారిపేరుకూ  అప్రతిష్ట  తెస్తావేమిట్రా?  అని  భోజనం  దగ్గర  నన్నడిగారాయన.  మా చిన్నక్క సర్రుమని  అందుకుంది.
    ఓహో! దావులూరి వారి వంశానికి  మీరు ప్రతిష్ట  తెస్తున్నారుకదూ!  లక్కరాజువారి వంశానికి  లేకపోతే  పరవాలేదులెండి అని ముగించింది.
    బాగుంది. తమ్ముడంటే  ఎంత  ఆపేక్ష  అమ్మాయిగారికి! తమ్ముడికి  నీమీద  ఇంతేనా ఆపేక్ష  ఉందీ? వెళ్ళి కాశీలో కూచుని, ఉత్తరాలులేక,  అందరినీ ఏడిపించి కైలాసము గియలాసము  తిరిగి వచ్చాడు. బలేబలే
   నేను నెమ్మదిగా  ఆ మాటలు మాన్పించి,  బావా! నాగార్జున  కొండ శిల్పాలు  అంతకన్నా ప్రభుత్వంవారు  బాగా  ఉంచలేరా ఏమిటి?  ఆ రోడ్డు బాగుచేయించకూడదా? అని ఎత్తాను.