పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్న విషయం తప్ప ఆమెకు ఇంకోభావం ఇదివరకెన్నడూ కలగలేదు. ఇప్పుడేవో అర్థాలు, ఏదో మహత్తరశిల్పం ఆమె బ్రతుకంతా నిండినట్లయినది. హేమ కిదివరకు సంగీతం నేరుచ్చుకోవాలని దీక్ష కలుగలేదు. తండ్రిగారు శకుంతలకు నేర్పించి ఉండడంవల్ల ఈమెకు సంగీతము నేర్పించలేదు. ఆమె ఏ సంగీత సభలకూ వెళ్ళలేదు. రేడియోలో సంగీతం వస్తే ఏదో వినేది. నిశాపతి సంగీతం కూడా ఆమెకంత ఆనందం కలిగించలేదు. ఉత్తరాదిపాటలో గొప్పవాడైన తెలుగువాడు తనకు స్నేహితుడు అన్న బడాయి మాత్రమే ఆమెకు తెరలువీడి ఎదుట ఒక పరమాద్భుత గాంధర్వలోకం ప్రత్యక్షమైనది.

   నిశాపతి సంగీతమంతా ఆమె  హృదయంలో  మరల స్వనించినది. రుక్మిణీదేవి నాట్యానికి హంగుగా  పాడే  ఆ  నాదస్వరమూ, వాయులీనమూ సర్వ మధురాలూ, లయమై, జిడ్డులతో గట్లుపొర్లి ప్రవహించినట్లామెకు తోచినవి. తానెందు కిన్నాళ్ళూ సంగీతం నేర్చుకోలేదో! తానేకళలూ  నేర్చుకోలేదు. కవిత్వం నీరసమని  తోసివేసింది. పత్రికలలో  కథలూ, పద్యాలూ పాటలు, సాహిత్యవ్యాసాలూ, కళాప్రవచనాలూ ఎప్పుడూ  చదివేదికాదు. ఎంతసేపూ  రాజకీయాలూ, దేవుడులేడనే  వ్యాసాలూ, శాస్త్ర సంబంధ వ్యాసాలూ చదివేది. తెలుగుభాష  చదువుకోమని లోకేశ్వరి  పోరు పెట్టడంచేతా,  ఎందుకు వచ్చాయో  తెలుగు  పేపర్లన్నిటికీ  నూటికి యనభై  పైన  మార్కులు రావడంచేత,  ఆమె తెలుగు ఆనర్సు తీసుకుంది. ఆ ఆనర్సు పరీక్షకు  సంబంధమైన  తెలుగుమాత్రం  ఆమెనేర్చుకుంది. అందులో మొదటి తరగతేమిటి, విశ్వవిద్యాలయానికి మొదటగానే తాను కృతార్ధురాలు కావచ్చును.  ఆమెకు తెలుగన్నా, సంస్కృతమన్నా అభిమానం వుండి ఆ విషయం  చదవడం  ప్రారంభించలేదు. కేవలం  పరీక్షకోసమే!
   అలాంటిది  నేడు  తెలుగు  ఎంత  మధురమైనది! తాను తెలుగులో  ఎందుకు కవిత్వంచెప్పరాదు? సంస్కృతం దేవభాష. సంస్కృతసాహిత్యం సాహిత్యలోక  పరమావధి,  అనే  ఆలోచనలు  ఆమెను  నిండిపోయాయి. భగవంతుడున్నాడు. అతడు పరమ దయాస్వరూపుడు, ఆనందరూపుడు, సౌందర్యనిధి అనే భావాలు  ఆమెపై  జడివానలా  వర్షించాయి. యెవ్వరో  ఇంకో  వ్యక్తి  తన్ను  అలమి  తనలో  ఇంకిపోయి,  తన సర్వస్వము నిండినట్లామెకుతోచింది. అప్రయత్నంగా ఆమె  త్యాగతి  భుజంమీద  చేయివేసింది. త్యాగతి గజగజ  వణికిపోయినాడు. అతనికి  కళ్ళలో నీరు తిరిగినది. కదలక స్థాణువులా నాట్యం  చేస్తున్నట్లే నటించినాడు.  ఆ  విచిత్ర  దినము  హేమ  ఎన్నడూ మరచిపోలేదు. త్యాగతిని  ఎప్పుడూ రమ్మని  కోరేది. అతనిచే పాఠాలు కూడా  చెప్పించుకునేది.  ఈనాడు  త్యాగతికథ ఇంతవరకూ  చదవగానే  ఆమెకు  భయమూ,  సంతోషమూ అన్నీ ఒక్కమాటే కలిగాయి.