పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్యాగ : ఉన్నాయి. బాలబాలికల బొమ్మలు. వారి ఈడుకు తగినట్లే ఉంటాయి. అందులో కొందరు నిజంగా అత్యుత్తమ కళావేత్తలు కాగల సూచనలు చూపించారు. రండి లోపలికి వెడదాము.

   హేమకు  ఆ  నూత్న  పురుషుణ్ణి చూడడంతోటే  ఏదో అనిర్వచనీయమైన ఆనందం  కలిగింది. కల్పమూర్తి ఈ కొత్తమనిషి చాలా  పెద్దమనిషి. మంచి విజ్ఞాని  అని అనుకున్నాడు.  ఈయనకు  ఇరవై  అయిదు సంవత్సరాల ఈడు  ఉండవచ్చును. ఈయన  స్నేహపాత్రుడు అనుకున్నాడు. ఎవడు బాబూ వీడు! నియోగులలో  త్యాగతి  ఇంటి పేరు  ఎవరికి  ఉందీ? వీడు వట్టి బాబులురాయుడులా ఉన్నాడు. వీణ్ణి కాస్త దూరంగానే  వుంచాలి అని  అనుకున్నాడు తీర్థమిత్రుడు.  వీడికి కాస్త  సంగీతం అంటే  ఇష్టమేమో? అయినా మన సంగీతం  వినాలి. వీడి బడాయి కనుక్కోవాలి మనం! సరే మనకెందుకు  ఎవడు ఎవడైతే  నేమిటి?  అని నిశాపతి  తలపోసుకున్నాడు. సోఫీ త్యాగతి  మోము ఒకసారి  తీక్షణంగా  చూచింది.  ఇతడు  పాశ్చాత్యదేశాలు  చుచాడా? మనజట్టుకు  తగినవాడే. ఈయన  శిల్పాలు చూసి, ఈతని  తాహత్తు ఎంతో  గ్రహించాలి అని అనుకుంది. లోకేశ్వరి  మాత్రం  త్యాగతి  కళ్ళల్లో తన  స్నేహితురాలిని  అతడు చూచిన  పూజాకాంతులు  చటుక్కున  చూడగలిగింది.  గంభీరమైన  అతని కంఠం  ఎంతో  మధురమైనది అనుకుంది. ఈతనికి  భార్యాబిడ్డలున్నారా? అని ప్రశ్నించుకొన్నది. ముసలాయన  వినయకరావుగారు  అమ్మయ్యా, కాస్తయితే  అసలు పేరు  చెప్పేద్దునేమో!  ఆశ్వత్థామా హతః, కుంజరః!  అనే అబద్దము  చెప్పడమా?  కష్టమే! అనుకున్నాడు. నాతండ్రి  శ్రీనాథమూర్తి! ఎంత ఠీవిగా ఉన్నాడు. నా కన్నతల్లి, నా బంగారుతల్లి,  నా ప్రాణం శకుంతల  ఈతనితో  పిల్లలతో నడుస్తూ వచ్చునుగదా! అని ఆలోచించింది, హేమతల్లి. ఆ  ఆలోచన  తట్టగానే, ఆమె కళ్ళనీరు గిఱ్రున  తిరిగాయి. ఎవరికీ తెలియకుండా  కొంగుతో  కన్నీళ్ళు తుడుచుకొంది.
   వారందరూ  లోనికి పోయినారు. హేమకు  ఎందుకో  పట్టలేని  అనందం కలిగింది. త్యాగతిని ఒక్క నిమిషం వదలలేదు.  చక్కగా, మధురంగా, గంభీరంగామాట్లాడే అతని  సంభాషణ  వింటూ  ప్రదర్శనచిత్రాలూ, వస్తువులూ చూచింది.