పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్యాగతి : లోహం, పాలరాయి, నల్లరాయీ, ప్లాస్టరు అన్నింటితోనూ చేస్తాను. ఈ ఊళ్ళో దారుశిల్పం నేర్చుకుందామని ఒకటి రెండు సంవత్సరాలు వుండదలచుకొన్నాను.

   హేమ : అయ్యా  త్యాగతిగారూ! నాకూ  మిమ్మల్ని  బాగా  ఎరిగి  వున్న  స్మృతి  కులుగుతోంది. కానీ  ఎప్పుడో, ఎలాగో  చెప్పుకోలేకుండా వున్నాను.
   త్యాగతి : నీ కప్పుడు  చాలా  చిన్నతనం!
   హేమ : మా స్నేహితులను  మీకు  ఎరుకపరచ అనుజ్ఞ ఇవ్వండి. మా నాన్నగారూ, అమ్మగారూ మీకు  చిరపరిచితులేగదా! వీరు  తీర్థమిత్రులు.  అసలు పేరు జానకిరామమూర్తి, మా సంఘంలో తీర్థమిత్రులు.  ఈ ఊళ్ళో  వీరికి  జీవన్ లాల్, దయాలాల్  కంపెనీలో  ముఖ్య  లెక్కదారుపని.  వీరు కల్పమూర్తిగారు, నిరుద్యోగులు, పిల్లజమీందారులు. అసలుపేరు  శ్రీనివాసరావు, మా సంఘములో  కల్పమూర్తి. వీరు నిశాపతిరావుగారు.  అద్భుతగాయకులు, ఉత్తరాది  సంప్రదాయంలో  అబ్దుల్ కరీంగారి తర్వాత  వీరే. అసలు పేరు  జగపతిరావు, మా పేరు  నిశాపతిరావు....
   త్యాగతి : జగపతిరావుగారు వీరేనా? వీరి పేరు  ఉత్తరాదిని  చాలా ప్రచారంలో ఉంది. ఉత్తరాదివారు వీరిపాటంటే  చెవికోసుకుంటారు. 
   హేమ : అయితే  ఎంతమందికి  చెవులు  లేవండీ?
   అందరూ పకపకా నవ్వినారు. త్యాగతి  ఒక్కొక్కరికే  నమస్కారం  చేస్తూ  కరస్పర్శనం చేశాడు. 
   హేమ : ఈమె  సోఫీ.  అచ్చమైన  ఆంగ్లయువతి. ఈమె  తండ్రి  తాతల  నుంచీ ఇక్కడే ఎస్టేటులు  కొనుక్కొని భారతీయ  జమీందారులయ్యారు. ఈమె  ఇంగ్లండులో పుట్టింది. ఇక్కడ వైద్య  పట్టభద్రురాలు కాదలుచుకున్నది. సంపూర్ణ నామం  మిస్ సోఫియా విలియమ్స్. సర్ డబ్ల్యు విలియమ్స్ గారి  ఏకైక పుత్రిక.
   త్యాగ : నమస్కారం మిస్ సోఫీగారూ , క్షేమమా?
   సోఫీ : మీరు  క్షేమమా?
   ఇద్దరూ  కరస్పర్శ  కావించుకొన్నారు.
   హేమ : ఈమె   మా లోకేశ్వరి, ఆలు పేరు  దూర్వాసుల  వెంకటరత్నమ్మగారు. బి. ఏ. ఇంటరులో  మేం  ఇద్దరం  సహపాఠకులం. మా సంఘంలో  ఈమె  పేరు లోకేశ్వరి.
   త్యాగ : నమస్కారం అండీ లోకేశ్వరిగారూ!
   లోకే : నమస్కారం  శర్వరీభూషణ్ గారూ!
   హేమ : మీరీ  ప్రదర్శనం  చూచారా?
   త్యాగ : మూడుసారులు.
   హేమ : మంచి బొమ్మలున్నాయా?