పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏడాదికావచ్చింది ఇతడు తన జీవితచరిత్రలో ప్రవేశించి! ఈతడంటే తనకున్న భావాలేమిటి? తన స్నేహితులతో, స్నేహితురాండ్రలో త్యాగతే గొప్పవాడు. ఆతడు చిత్రకారుడనీ, శిల్పిఅనీ తాను బాగా ఎరుగును. కాని అతడెవరో తన తలిదండ్రులకు మాత్రం పూర్తిగా తెలిసి ఉండాలి. ఆమె తన స్నేహితులతో కూడి త్యాగరాజనగరంలో వున్న ఆతని శిల్పశాలకు ఎన్నిసారులో వెళ్ళినమాట నిజమే! రెండు మూడు సార్లు త్యాగతి తల్లి తన అక్క అత్తగారులా వచ్చి తన్ను దగ్గరకు తీసుకోవటం తానేదోరకంగా అర్థంచేసుకుంది. ఆ రోజుల్లో తన అక్క అత్తగారు తమ్ము చూడడానికి కొల్లిపరనుంచి వచ్చిందని తాను అనుకున్నది. ఆమె త్యాగతి తల్లి అని ఎరుగదు. త్యాగతికి తల్లి వున్న సంగతే తనకు తెలియదు. లోకేశ్వరికి ఈ విషయం ఎప్పటినుంచి తెలుసును?

   ఎక్కడైనా  ప్రపంచంలో, ఈ  1941వ  సంవత్సరంలో, ఒకడు తానెవరో  తన  మరదలకి  తెలపకుండా  వుండగలడా? ఇది  కథ అనుకున్నాడా, సినీమా అనుకున్నాడా? ఇందుకు  తానేమి  చెయ్యాలి? తన అమ్మ  నీరసస్థురాలు, ఎప్పుడూ జబ్బుతో మూలుగుతూ వుండేది. తన అక్క  శకుంతలా దేవి మాయమైపోవడంవల్లనే    తన   తల్లికి   అలాంటి   జబ్బుస్థితి   సంభవించింది.  అలాంటి  జబ్బుమనిషి  త్యాగతితో మాట్లాడుతూ   బాగా  తేరుకుంది.  తల్లిదండ్రులుకూడా  తన కాతనగూర్చి  చెప్పకుండా  ఎల్లా  వుండగలిగారు?  తన ఒక్కదానికే  ఈ విషయం  తెలియకుండా  వుంచడంలో వుద్దేశం  ఏమిటి?  లోకేశ్వరిగూడా తెలుసునా?  అందరూ తన్ను  మోసం  చేయదలచుకొన్నదానిలో అర్థం  ఏమిటి?  తాను పరీక్ష ప్యాసయింది  1940 సంవత్సరం ఏప్రిల్ నెలలో.  ఈ  రోజు  ఫిబ్రవరి 1941సంవత్సరం. త్యాగతి  తనకు  ప్రథమ  పరిచయం  అయినది 1939డిశంబరు 26వ  తారీకు. ఆ  తారీకు తానెప్పుడూ మరచిపోలేదు.
   అడయారులో  అఖండోత్సవం  జరుగుతున్నది.  దేశదేశాలనుండి  ప్రతినిధులు, ప్రేక్షకులు  వేలకువేలు  వచ్చారు. ఆ  రోజున  రుక్మిణీ అరండేలుగారి  నాట్య  ప్రదర్శనం  సాయంకాలం ఆరు నుండి  ఎనిమిదిన్నర  వరకూ జరుగుతుంది. ఆ  ప్రదర్శనం  చూడడానికి ముందే  పదిరూపాయల  టిక్కెట్లు కొనుక్కొని  హేమసుందరి  జట్టువారూ,  ఆమె తల్లిదండ్రులూ  వచ్చారు. లోకేశ్వరి వచ్చింది. లోకేశ్వరి అని పేరు  హేమ పెట్టింది. ఆమె ప్రతి విషయం  తెలుసుకోవాలని  పుస్తకాలు  తింటుందట. అందుకు లోకేశ్వరి  అని హేమ  పేరు పెట్టింది.  ఆ పేరే  అందరూ  ఎరుగుదురు. అసలు  పేరు వెంకటరత్నమ్మ. కల్పమూర్తి అసలు పేరు  శ్రీనివాసరావు. కల్పించనన్నా  కల్పించలేనివాడనిన్నీ, ఏ  ప్రథమ  రాతి  యుగానికో  చెందినవాడనిన్నీ చెప్పి  కల్పమూర్తి  అని పేరు  పెట్టింది హేమ. నిశాపతి అసలు పేరు   జగపతిరావు. నల్లగా ఉండే  మనుష్యుడు  వట్టి  'నిశ' వంటివాడు