పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

   1931వ  సంవత్సరం నవంబరు  నెలలో నేపాలునుండి బయలుదేరి బెంగాలు చేరి, అక్కడనుంచి  హరిద్వారం  వచ్చాను. వచ్చీరాగానే మా గురువుగారి  ఆశ్రమానికి  వెళ్ళి వారి పాదాలమీద  వ్రాలాను. నేను నేపాలునుంచి ఎప్పటికప్పుడు  స్వామీజీకి ఉత్తరాలు  వ్రాస్తూండేవాడిని. ఇండియాలో  కాలు పెట్టగానే స్వామీజీకి  నేను వస్తున్నానని తంతి  ఇచ్చాను. నన్ను  ఆశీర్వదిస్తూ  స్వామీజీ చిరునవ్వు  నవ్వుతూ, నన్ను లేవనెత్తి, ఆసనంమీదే  కూర్చుండుమని సైగచేశారు. నేను కూర్చోగానే  స్వామీజీ నన్ను  కుశల ప్రశ్నలడిగి, నేపాలుదేశ  యాత్రా  విషయాలన్నీ  తెలుసుకున్నారు. నేపాలునుంచి  స్వామీజీకి నేను  వ్రాసిన  ఉత్తరాలతో కలిపి  మా అమ్మగారికి  ఉత్తరాలు  వ్రాయడం  సాగించాను. వానిని  స్వామీజీ  ఎప్పటికప్పుడు  భట్టిప్రోలు పంపిస్తూ  ఉండేవారు. నేను  భరతభూమిలో కాలు పెట్టగానే,  స్వామీజీ నేను వస్తున్నానని మా అమ్మగారికి  తంతి ఇచ్చారు. నేను వచ్చిన మరునాడు  మా అమ్మగారు  హరిద్వారం వచ్చారు. నేను స్టేషనుకు  వెళ్ళి, బండి వెతుకుతూ, మా అమ్మగారూ, మా సుబ్బులూ కలసి  బండి  దిగడం చూచి అక్కడకు  పరుగెత్తాను. ఇద్దరూ నన్ను ఒక్క  నిమిషం  తేరిపార చూచారు!
    ఒరే బావా! అంత  మారిపోయా వేమిటిరా? 
    ఏం  మరానురోయి! జబ్బుగా లేదుకదా, కొంపదీసి! 
    ఛా! ఛా! ఏం పాడుమాట. నీ  చిన్నతనంలోని  వెన్న ముద్దలరూపం నిరుడు మాడి నల్ల పడిపోయినది. చిక్కిపోయి, మొగాన్ని నల్లని మచ్చలు, కళ్ళ కింద  నలుపులు, ముడతలుపడి, జుట్టు అక్కడక్కడ  తెల్లబడి, నలభై  ఏళ్ళా అన్నట్టుగా కనబడ్డావురా! ఇప్పుడు నీ ఇరవై  ఏళ్ళరూపూ  కనబడుతోంది. జుట్టు  బాగా  నల్లబడింది. ఏదో గంభీరత ఉంది నీ రూపుల్లో  మోము వెలుగుతున్నట్లుందిరా!     
   మా అమ్మ, అప్పుడు  నన్ను చూచి, నాన్న! నీ  ఆరోగ్యం  ఇప్పుడు  చాలా బాగుందిరా! నిన్ను ఆనవాలు  కట్టలేకపోయానురా! 
   నేను : అమ్మా! నా  ఆరోగ్యానికేమీగాని, నువ్వు  బొత్తిగా  చిక్కిపోయావే!
   అమ్మ : నీకోసం ఏదో బెంగ. మళ్ళీ స్వామీజీని  తలుచుకొని ధైర్యంగా  ఉండేదాన్ని. ఈవాళ  నిన్ను  చూడగానే  నాకు  కలిగిన  ధైర్యం వేయి ఏనుగుల  బలం ఇచ్చిందిరా! 
   మా  అమ్మా, నేనూ  స్వామీజీ  దగ్గర  నెలరోజులు వున్నాం. అనేక విషయాలు  వారితో చర్చించేవాణ్ణి.  స్వామీజీ  ప్రతి విషయమూ పండు ఒలిచి  చేతికిచ్చినట్లు చెప్పేవారు. స్వామీజీకి విపరీత మేధ. వారు ఆంగ్లదేశము, యూరోపు, అమెరికా  అన్ని దేశాలు  తిరిగారు. శాస్త్రపరిశోధన ఈనాటికి  ఎంతవరకు  వచ్చిందో