పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వాతంత్ర్యం ఇతరుల స్వాతంత్ర్యం దగ్గర ఆగాలి కదా? మానవ ధర్మం, ప్రేమ, దయ, సత్యమూ, శీలమూ తన స్వాతంత్ర్యాన్ని అరికట్టుతాయిగదా! మనుష్యుడు పిచ్చివాడయితే విషం పుచ్చుకుంటాడెమో? కట్టిపెట్టి నరుక్కుంటాడా మంచివాడు? కఱ్ఱ పెట్టి కొట్టుకుంటాడా? అల్లాగే తన కుటుంబానికి, తనకు, తన దేశానికి, సర్వధర్మాలకు వ్యతిరేకమయిన పనులు చేస్తాడా? అలాంటి కవిత్వం, చిత్రలేఖనం సృష్టించగలడా?

    స్వామీ! కేవల  సౌందర్యారాధన రూపమయిన  కవిత్వం  ఎందుకు రాయకూడదు?  సంపూర్ణ  సౌందర్యారాధన  మనుష్యునికి  హాని  కలిగిస్తుందా? 
    సౌందర్యారాధన లేనిదే  కళలు పుట్టనే  పుట్టవుకదా బాబూజీ! కళాత్మకు  సౌందర్యారాధనే మూలశక్తి. ఆ  ఆరాధన ప్రకృతి సౌందర్యారాధనగా, మానవ సౌందర్యారాధనగా, మానవ సృష్టి సౌందర్యారాధనగా,  మానవ చిత్త, గుణ, ఆత్మ సౌందర్యారాధనగా, మానస చరిత్ర  సౌందర్యారాధనగా  వుంటుందిగదా!
    చిత్తం. నా  వుద్దేశంలో,  మానవుడు తన్నే నాయకుణ్నిగా చేసుకొని, తన  ప్రేమ విధానాన్ని నాయికనుచేసి  కావ్యం  సృష్టించవచ్చునా? 
    తప్పకుండా! తన మనస్సు  లేనిది, లలితకళలే లేవుకదా! వస్తువు, దర్శనము చేయువాడు__ఈ ఇరువురి  సంబంధంలో  నుంచి  కదా లలిత కళలు వచ్చేది. ఆ కళలు  రెండు  రకాలుగా సృష్టిస్తాడు. ఒక  దానిలో  వస్తువు  వెనక  తాను  దాక్కొంటాడు.  ఇంకొకదానిలో తానే ప్రత్యక్షమౌతాడు. వస్తుగుణ, మానవ భావ ప్రదర్శనాలు సంపూర్ణంగా  శిల్పి  హృదయ  ప్రదర్శనాలే కదా!
   శృంగారరసానికి స్థానం ఏదండీ? 
    శృంగారరసం కళలో ప్రథమస్థానం వహిస్తుంది. సౌందర్యారాధనే శృంగారరసం. ఉత్తమ శృంగారం  భక్తి. భగవంతుని  అర్చించే భావము మనుష్యునిలో  స్త్రీ  భావము, భగవంతునిలో పురుషభావము  ఆరోపించుకొని గదా భక్తియొక్క శిఖరిత భావం  సృష్టించుకొన్నాడు  మనుష్యుడు! 
   ద్యూపాంగు ఆంధ్రసంప్రదాయ  పరంపరాను గతస్వరూపం  తాల్చింది. ఆంధ్రుణ్ణయిన నేను  అక్కడి  విద్యార్ది నయ్యాను. నా  ఆంధ్రదేశంలో ఇప్పుడు  శిల్ప  చిత్రకళలు  అధోగతిలోవున్నాయి. అవి  పునరుద్దరించడం నా  ధర్మము. దామెర్ల  రామరాయుని  చిత్రలేఖనాలు అనేకం  చూచాను. ఆ ఉత్తమ  పురుషుడు  ఆంధ్రసంప్రదాయం  పునరుద్దరింప  ప్రయత్నం  చేశాడు. ఆ ప్రయత్నంలో  కొంతవరకూ  జయంపొందినాడు. కాని  సిద్ది  లంభింపకుండా అవతారం  చాలించాడు. అందుకనే  అతని  చిత్రాలలో పరిపూర్ణత వచ్చే  స్థితి ద్యోతకం అవుతుంది. వర్ణాలు  ప్రాథమిక  స్థితి  దాటుతున్నాయి. రేఖలలో కర్కశత్వం వీడుతూవుంది. అంగవిక్షేపాలు  లాలిత్యం తాల్చబోతున్నాయి. భావమేళనము పూర్ణత  వహించబోతున్నది. చిత్రాలకు  వ్యక్తిత్వం  వస్తూ ఉన్నది. ఎంత  రసవత్తరమైనా  చిత్రానికీ, చిత్రంలోని పాత్రలకూ వ్యక్తిత్వం ఉండాలి. రామావతారం,