పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలోని కళావిషయకరమైన ప్రశ్నలకు శిల్పాచార్యులైన ఆ త్రివిష్టప బుద్థ భిక్షాచార్యులే సంశయం తీర్చాలి. పెట్టిన శుభముహూర్తమునుంచీ శిల్ప, చిత్రలేఖనాలు నేర్చుకోవడం ప్రారంభించాను. నేను జూను, జులై, ఆగస్టు నెలలు ద్యూపాంగు సంఘారామంలో ఉన్నాను. దారుఫలకంమీద సన్నని ఉల్లిపొరగుడ్డ అంటించి, అది చిత్రలేఖనానికి అనువుచేసి , దానిమీద చిత్రించడం ఒక విధానం. గుడ్డమీదనే చిత్రించడం రెండవ విధానం. నేపాలునుండి వచ్చిన చేతి తయారు కాగితాలమీద చిత్రించడం మూడవ రకం. ఈ విధానాలన్నీ నేర్చుకున్నాను. మా గురువుగారు శిల్ప గ్రంథాలు రెండు నాకు విపులంగా వ్యాఖ్యానంతో చెప్పారు. మా గురువు గారికి హిందీ రాదు. స్వామీజీ శిష్యులయిన ఒక స్వాములవారు మా ఇరువురి మధ్యా ద్విభాషి అయ్యారు.

   దారుశిల్పం, లోహశిల్పం  తిబెత్తు వాసులకు  ఎక్కువ  ఇష్టం. నేపాలులోనూ అంతే. స్వదేశంలోనే  శిలాశిల్పం  నేర్చుకోవాలి అని సంకల్పం చేశాను. మా గురువుగారు  ఒక దినం  నన్ను ముఖ్యాచార్యులైన కులపతి కడకు  తీసుకొని  వెళ్ళారు. వారు నాకు  లలితకళలను  గూర్చి  ఉపదేశించారు!
    నాయనా! నువ్వా  రోజున చెప్పినట్లుగా  లలిత కళలు ఆనందం కోసం  కదా  మనుష్యునిలో ఉద్భవించాయి!  సరే, ఆ ఆనందం  కూడా  మనుష్యునిలో  ఊరికే ఉద్భవించలేదు అతని  పురోభివృద్దికే  అతనిలోవున్న  సమస్త ఉత్తమ  గుణాలూ తేజరిల్లుతున్నాయి. అట్టి అనందం  అనేది పిచ్చివానికి మాత్రం  వుంటుందేమో! తన జీవితంలో  భాగమైన ఉత్తమ విషయాలు  కళా స్వరూపంతో  దర్శన  మిచ్చినప్పుడు మనుష్యునికి  నిజమైన ఆనందం  కలుగుతుంది.
    ఆకలివేసి, ఆ ఆకలి  తీర్చుకొనుటకు  భోజనంచేస్తే, ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం  తుచ్ఛమే అగుగాక. కాని, ఆకలి తీరడం భౌతికాభివృద్ది కొరకేకదా! ఆనందమూ, భౌతికాభివృద్దీ రెండూ కలసి వున్నాయి  ఆకలి తీరడంలో!  అలాగే  ఆనందం  ప్రయోజనంలో  పరమార్ధం కూడా  వుండి తీరుతుంది.   
    కాబట్టి కళను  ఉత్తమ  ప్రయోజన  స్వరూపంచేస్తే   మానవ  పురోభివృద్దికి  ఎంతో  మహోత్తమ  కళ అవుతుంది.
    స్వామీ! కళాస్రష్ట  సర్వస్వతంత్రుడుకదా, అలాంటప్పుడు అతన్ని ఈ రకంగా  కళ  వుండాలి అని   ఎవరైనా  నిర్భంధింపగలరా?  అన్న ప్రశ్న  నన్ను  బాధిస్తోంది అని  అ లామాను  ప్రశ్నించాను.
   అ వృద్ద  సన్యాసి  చిరునవ్వు  నవ్వాడు. ఆ మందిరం  అ నవ్వులతో వెలిగిపోయింది.
   
           
                                                                                                                  2
   
    నాయనా! నిజంగా  మనుష్యునికి  సర్వ  స్వాతంత్ర్యం వుందా? పుట్టిన దేశం, కుటుంబం, కాలం అతని  స్వతంత్రాన్ని చాలా వరకూ  అరికట్టలేదా? భారతీయుడైతే బానిసగానే పుట్టుతున్నాడుగదా, అప్పుడాతనికి స్వతంత్రం వుందా?  మనుష్యుడు తన  గుణగణాలకి తానే ఆనకట్ట కట్టుకోవాలి గదా? తన