పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆత్మ ఒకదాన్ని ఒకటి చంపకూడదు. ఈ మూడు ఒకే మహాభావం యొక్క త్రిమూర్తిత్వం సుమా! భావ రాగ తాళాలు సమ్యక్ స్థితిపొందడం నిజమైన సంగీతం. అలాగే రంగు, రేఖ, మూర్తి, భావంసమ్యక్ స్థితి పొందిన చిత్రలేఖనం. రేఖలూ, మూర్తీ, భావము సమ్యక్ స్థితి శిల్పం' అని నాకు వినపడినట్లయిందండీ. నాకేదో వివశత్వం కలిగి కన్నీళ్ళు దొనదొన జారిపోయాయి. గురుదేవా! నాకున్న అనుమానాలు పోయాయి. తమ ఆదేశము ప్రకారము నడుస్తాను. సెలవు దయచేయండి అని నివేదించుకున్నాడు.

   నేను: నాయనా! నీలో  ప్రపంచం  పూర్తిగా మాయంకాలేదు. నీ బోటివాళ్ళు భౌతికంలో, సత్యశివసుందరత్వాన్ని ప్రదర్శించి  ఆధి భౌతిక, ఆధిమానసిక,  ఆధ్యాత్మికాలకు సమన్వయం చేయడానికి  ఉద్భవించారు. ఆ ధర్మాన్ని  నువ్వు  విసర్జించకూడదు. నీ శకుంతల  నీకు  వేరేరూపంలో ఈ  జన్మలోనే  దర్శనం ఇస్తుంది. ఆమె, ఈమె  అని  నీకే హృదయగోచరమవుతుంది. ఆమెతో  ఏడాదిపాటు  నీ కథ చెప్పకు. నీ జీవిత పరమావధికి తోడు నీడకావాలి. శక్తిలేని శక్తుడెట్లా? సరస్వతిలేని  బ్రహ్మ ఉండునా? మానవ ధర్మయుద్ధం స్త్రీ, పురుషులు కలిసి  చేయాలి. పారలౌకికయుద్ధం  మాబోటివారు నిర్వహిస్తారు. ఏడాదయిన వెనుక  నీ  చరిత్ర  చెప్పుకో. ఏది  ఎట్లా  సంభవించినా, నీ ధర్మం  నువ్వు మానకు. ప్రజాసేవ  నీ ధర్మం. అది లలితకళల ద్వారా  నువ్వు చేయాలి. నువ్వు  ఈ ఆశ్రమంలో  కొన్ని నెలల పాటు  వుండు. నేను కైలాసపర్వతేశ్వరునకు  నమస్కరించి  హిమాలయాలకు వెళ్ళిపోతాను. సెప్టెంబరునెలలో  నువ్వు  నేపాలు వెళ్ళు. అక్కడకు వెళ్ళే  అనువులన్నీ నేను చూస్తాను. అక్కడి శిల్పమూ, చిత్రలేఖనమూ పరీక్షించు. నవంబరు నెలలో  నన్ను  హరిద్వారంలో కలుసుకో. అప్పటికి  మీ  అమ్మగారు  హరిద్వారం వస్తారు. నువ్వు ఏప్రిల్ నెలవరకూ  నా దగ్గర హరిద్వారంలో ఉండు. తర్వాత  మీ  అమ్మగారితో  హిమాచలయాత్ర చేయి.  ఆ  తర్వాత  మీ గ్రామం  వెళ్లు. అక్కడనుండి  నీకు  ఏది ధర్మమనితోస్తే అదిచేయి. 
   ఈ ముక్కలు  నేను  చెప్పుతుండగానే  శ్రీనాథమూర్తి  కరిగిపోయినాడు. అతడు  నా  కాళ్ళకడ  సాష్టాంగపడి, కళ్ళనీళ్ళు  కారిపోవగా  తమ ఆజ్ఞ  అక్షరాలా  నిర్వహిస్తాను  గురుదేవా! అన్నాడు.
   
                                    14  
   
   స్త్రీగాని, పురుషుడుగాని  ప్రపంచ సాంస్కృతిక  పురోగమనానికీ, సంతతాభ్యుదయానికీ  ఆధారశక్తి రూపం కావాలి. ఈనాడు  భరతదేశంలో స్త్రీ  అత్యంత  హీనదశలో ఉంది. పురుషుడు ఎంతచదువుకున్నా నిజమైనధర్మం దూరంగానే  వుంచుకొన్నాడు. ఎన్ని ఉద్యమాలు వచ్చినా, భారతదేశ యువకునిలో  పశుత్వం  ఎక్కువ అవుతోంది గాని  తగ్గటంలేదు. ఇప్పటికి ఆడది ఒక్కతే  ప్రయాణం చేయలేదు. మూగదేవుడులా గృహంలో  బాధలుపడుతూ త్యాగభారం కొండలుకాగా  నడుము వంగిపోయి  జీవిత ప్రయాణం సాగిస్తోంది. పురుషుడు ఆత్మదర్శనంకోసం ఎన్నో  కడగండ్లుపడి, హీనస్థితిని  కూడా పొందుతూ,