పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అని కొందరు అంటారు. అవి వేదాంత విషయాలుగా రావచ్చును అంటారు కొందరు. కాని పనిని గూర్చి ఆలోచించి, విధానం నిర్థారణ చేసికొనిగానీ, కొంతవరకూ నిర్థారణ చేసికొనిగానీ మనుష్యుడు చేసే పని కళే.


ఆ సభలో కూర్చున్న వారందరూ నిశ్శబ్దంతో శ్రీనాథమూర్తి మాటలు వింటున్నారు. శ్రీనాథమూర్తే అతి జాగ్రత్తగా ఆలోచించుకుంటూ తన అభిభాషణ నడుపుతున్నాడు. నేను శ్రీనాథమూర్తి వాక్యాలు, మనస్సు, వాదన అన్నీ పూర్తిగా గమనిస్తున్నాను.

   శ్రీనాథమూర్తి  లలితకళ  అంటే  ఏమిటో  నిర్వచనం  చేశాడు.  అలా మనుష్యుడు చేసిన  పనులలో  అంటే, కళలలో  కొన్ని వట్టి  ఆనందం  కోసం మాత్రం చేసిన  పనులు ఉంటాయి. అవి  సౌందర్య  స్వరూపాలైతే  లలితా కళ అంటారు.  స్వామీజీ   సెలవిచ్చినట్లు  మనుష్యునిలో  వున్న సౌందర్యతత్వం  ఈ  లలితా కళలకు  ఆధారం. ప్రకృతిలో  వున్న  రంగులూ  మూర్తులూ, ధ్వనులూ, ప్రకృతిలోని  కదలికా  అతని సౌందర్యోపాసనకు  ఆధారాలయ్యాయి. అవే చిత్రలేఖన,  శిల్ప, సంగీత, కావ్య, నాట్యాదులయ్యాయి. మనుషునిలో  పశుత్వం ఎంత  నిజమౌ, ఈ  సౌందర్యతత్వమూ  అంతే  నిజము. కొందరు కొన్ని పనులు చేయగలిగి, కొన్ని  చేయలేనట్లు ,  మనుష్యులలో కొందరు  కళాస్రష్టలు, కొందరు కళానందులు,  కొందరు కళకు ప్రక్కనుంచి వెళ్ళిపోయే వారు__మూడు రకాలుగా  ఉన్నారు.
    కళ  ఆనంద  సముపార్జన  నిమిత్తం ఉద్భవించింది.  ఆ రకపు  ఆనందం  లలిత కళానందం. ఇది పూర్తిగా  మనుష్యుని  సౌందర్యారాధన  గుణంపై ఆధారపడి  ఉంది.
   నేనప్పుడు  శ్రీనాథమూర్తిని  చూచి,  మూర్తీ, పాశ్చాత్యకళలలో  దుఃఖరూపమైనవి, అసహ్యరూపమైనవి, హాస్యరూపమైనవి  లలితకళారూపాలున్నాయే?  అని ప్రశ్నించాను.
    నిజమే  స్వామీ! ఎలా  అయితే  మనుష్యుడు  తనకు  కావలసిన ఆహారాన్ని వాంఛింఛి, సంపాదించి, అది  తింటోంటే  ఎంత  సంతోషపడతాడో, అలాగే  సౌందర్యానందంకోసం సౌందర్యవస్తువులు సంపాదించీ, చూచీ ఆనందపడతాడు. భోజనంలో ఆరు  రుచులు  ఉన్నాయి. తీపి, కారం, ఉప్పు, పులుసు, చేదు, వగరున్నూ, తీపి అసలు రుచి. అలాగే, లలితకళలలో సమ్మక్  స్థితి  అనే రుచి  అసలు  సౌందర్యం  చేదు లాంటిది  విచారం, కారంలాంటిది కోపం, ఉప్పులాంటిది హాస్యం, జుగుప్స వగరు  వంటిది, అని నా  అభిప్రాయమండీ. 
   నేను: చాలా బాగా చెప్పావు. నీ పోలిక  చాలా  అందంగా  వుంది. తర్వాత కానీ !