పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరచరణకృతంవా, కాయజం కర్మజంవా

                                               శ్రవణనాయనజంవా  మానసంవాపరాధం
                                               విహిత  మవిహితంవా సర్వమేతత్ క్షమస్వ
                                               జయజయ  కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో.
   
                                                                                                              10
   
   శర్వరీభూషణుడైన శ్రీనాథమూర్తి  ఆ  సమాధిలో  నిశ్చలత్వం దర్శించాడు.  ఆ నిశ్చలత్వం  రూపొంది, తనువు చాలించిన  అతని భార్య  శకుంతలామూర్తి  అయిపోయిందట.  ఆ  శకుంతలామూర్తి  నవ్వుతూ  ఒక పాలరాతి విగ్రహంలా  మారిపోయిందట. ఆ  విగ్రహం  వేయి విగ్రహాలైనదట.  ఆ  విగ్రహాలన్నీ  లోకంలోని  దైన్యమూర్తులుగా, కర్షకులుగా, బీదలుగా, ప్రసిద్దకవులుగా, గాయకులుగా, నాయకులుగా  మారిపోయినవట. అప్పుడొక  దివ్యవాక్కు అతనికి  వినబడినదట.
    ఓయీ  శ్రీనాథా, త్యాగమే  మానవదివ్యత్వము, శాస్త్రమే జ్ఞానము, కళేభక్తి, వేదాంతమే మతము, ఈమూడూ  నాలోనే సమన్వయము. ఒక దానికొకటి  సంబంధం లేనట్లు వున్నా  అవి నాలో  లయమవుతున్నాయి. నేనే సర్వమతాలు, నేనే సర్వకళలు. వీని నిజమైన  అర్ధంకావాలంటే  ప్రతి విషయాన్ని  సమ్యక్ దృష్టితో  సందర్శించాలి.
   ఈ ముక్కలు  తన జీవితంలో  మారుమ్రోగుతుండగా శర్వరీ భూషణుడైన శ్రీనాథమూర్తి కళ్ళు తెరిచాడట. త్యాగంచే ప్రియమైన వాడు  త్యాగతి. అతడు త్యాగతి  శర్వరీభూషణుడౌగాక!
   సర్వకాలం కైలాసపర్వత సందర్శనము, తదానందము. పర్వత ప్రదక్షిణం ప్రారంభించాము. మా జట్టులోని  కొందరు  గంటకోసారి  కైలాసేశ్వరునికి  సాగిలపడుతూ  ప్రయాణం  చేస్తున్నారు. త్యాగతి శర్వరీ భూషణ  శ్రీనాథమూర్తి చేతులు  జోడిస్తూ  ఆ ఇరుకు  ఎగుడు దిగుడు  హిమపూరిత  వృక్షరహితపథంలో  నడుస్తున్నాడు. ప్రార్థనలు, భజనలు, నమక చమక గానాలు, ఆదిశంకరప్రణీత  శివానందలహరీ పవిత్ర  శ్లోకపఠనాలతో కైలాస పర్వతంచుట్టూ  మూడువారాలు  ప్రయాణం చేశాము. కొన్నిచోట్ల  రాత్రిళ్ళు  గుహలలో  మకాంచేయవలసి  వచ్చింది. హిమాలయాలకన్న  ఇక్కడ  గాలిఎక్కువ, చలిఎక్కువ; అంతా మంచుమయం. మధ్య మధ్య  అనేక  జాతులపూవులు, లతలుమాత్రం  తమసుగంధాలను  వెదజల్లుతూ వికసించి ఉన్నవి. తిరిగి తిరిగి  ప్రదక్షిణ  ప్రారంభస్థలానికి  వచ్చి  చేరాము.                                                                                                                           
           
               

కైలాసపర్వత పాదమునందు నిశ్చలమై ప్రత్యక్షమయ్యే మానస సరోవరంలో స్నానాలు సలిపి, అక్కడినుండి బయలుదేరి మూడురోజులలో ద్యూపాంగు బౌద్ద సంఘారామం చేరాము. అచ్చటి లామాలు మాకు ఆతిథ్యమిచ్చారు. వచ్చిన రోజు సాయంకాలం శర్వరీభూషణ శ్రీనాథమూర్తిని కులపతికడకు తీసికొనిపోయి ఆయనకు నమస్కారం చేయించాను.