పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంతత ఘనీభూత హిమపూతాచ్చమైన ఈ దివ్యపర్వతము పార్వతీ పరమేశ్వరుల నిలయమా? ఇరవై మూడువేల పైచిల్లర అడుగులు ఎత్తున్నదని అంచనా వేయబడిన ఈ పర్వతశిఖరము మానవ సంచారణాతీతము! ఆ దివ్యగోప్యప్రదేశాలలో గణేశుడు, కుమారుడు, నందీశ్వర భృంగీశ్వరులు, వీరభద్రుడు పరమ శైవానందంతో నాట్యం చేస్తూ వుంటారా? పరమశివుడు, పవిత్రనృత్య తాండవేశ్వరుడు, దివ్యరుద్ర వీణాతంత్రీ గానవినోది, యోగీశ్వరేశ్వరుడు, పరమదరిద్రుడు, నిత్యభిక్షాటనమూర్తి , శ్మశానవాటీనివాసి, నిత్యశివసుందరుడు. ఎంత అందమైన భావము! ఎంతో మహోత్తమోత్తమ భావము!

   కైలాసేశ్వర  పర్వత  శిఖరదృశ్య  సందర్శనాభిముఖుడైన  శ్రీనాథమూర్తి  వైశాఖాదిత్య  మధ్యాహ్న చండకిరణ స్పష్ట హిమఖండములా కరిగిపోయినాడు. అతని కన్నుల  అశ్రుధారలు యమునా  గంగానదులై ప్రవహించాయి. గాఢ ప్రేమవిధాన నాథసందర్శనమందు యోషవలె అతడు వెలిగిపోయినాడు. మానస సరోవరం  తీరంలో  మంచునిండిన ఆ  బండరాళ్ళలో, కైలాస శిఖరం ఎదుట మోకరిల్లి  సాష్టాంగమైపోయినాడు. అతడు గజగజ వణికినాడు.  పరుసవేది స్పృశించిన ఇనుమువలె  అతడు  తప్తజాంబూనందలా  ప్రజ్వరిల్లిపోయినాడు. అంతకుముందు  మాడిపోయినట్లున్న  అతని రంగు  హిమాలయ పర్వతాలలోకి చొచ్చి  వస్తున్నప్పటినుంచీ, మళ్ళీ  మునుపటి  బంగారుఛాయ  తెచ్చుకుంది. ఈనాడు, అతడు ఆ  దివ్యోదయ సంధ్యాక్షణంలో తేరిపార చూడలేకున్నాడు. ఒక నిత్య యౌవనం అతనిలో  తేజరిల్లింది. అతని పూర్వవాసనలన్నీ  ఒక్కసారిగా  ఆకురాలుకాలంలో  అకురాలినట్లు రాలిపోయినవి. అతని  ఆత్మ ఒక మహాసూర్యగోళమై తేరి చూడరానట్లయినది.
   
   ఓ పరమేశ్వరా! అతనిపై నీకు  కరుణ  జనించినదా? అతని జన్మలోక  కల్యాణంలో  ఉత్తమ  నాయకత్వం  వహించబోతున్నదా? 
   శ్రీనాథమూర్తి  లేచి  అలాగే నిలుచుండినాడు. అతడింతలో  చైతన్యరహితుడై పోయినాడు. పదిహేను నిమిషాలట్లు సమాధిలోకి  వెళ్ళిన  వెనక  నేను  ప్రణవనాదోచ్ఛారణ చేశాను.  అప్పుడు  కళ్ళుతెరచి నాదగ్గరకు  పరుగెత్తి  వచ్చినా  కాళ్ళకడ సాగిలపడి  నా పాదాలు  గ్రహించి,
                                                      కైలాసేశ సమారంభాం
                                                      శంకరాచార్య మధ్యమాం 
                                                      అస్మదాచార్య పర్యంతాం
                                                      వందే గురు పరంపరా
                                           అని  చదువుతూ  కన్నుల  వెల్లువైనాడు.
                                           చంద్రికా నాతూనిలా కనబడినాడు.
    శ్రీనాథమూర్తీ, నీకీ కైలాస పర్వత  సందర్శన పుణ్యకాలంలో శర్వరీ భూషణం అనే  పౌరుష  నామం  ఇస్తున్నాను. నువ్వు  దర్శించిన  మహాభావాన్ని  చంద్రునిలా  వెదజల్లు.