పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌందర్యం పులకరాలు కలుగజేస్తుంది కదా! నీ హృదయంలో సౌందర్యాన్ని గురించి ఉన్న భావాలన్నీ నాకు విందామని కుతూహలంగా ఉంది. ఎందుకంటే, మనం ప్రొద్దున చర్చించుకున్న విషయాని కది సన్నిహితం అన్నాను.

   శ్రీనాథమూర్తి : స్వామీజీ!  మానవుని సౌందర్యం  ఎక్కువగా  వికసించేది స్త్రీ  మూర్తిలోనని  నా  ఉద్దేశము. ఈ  సౌందర్యంలో  మూడుభాగాలున్నాయి. మూర్తిసౌందర్యం, వర్ణం, ప్రాణవిలసనమును.
   జమీ : నలుపువర్ణం  అందంకాదనా నీ ఉద్దేశం?
   శ్రీనాథ : ఏ  రంగైనా  అది  అందంగా  వుండవచ్చును. అంటే  అందంగా  ఉండేందుకు రంగు మట్టితో  కలిపినట్లు బురదలా ఉండకూడదు.  రంగులో  మాంద్యం  ఉండకూడదు.  రంగులో ప్రకాశం, నైర్మల్యం ఉండాలి. అదే  వర్ణసౌందర్యం. అలాగే  మూర్తిసౌందర్యం  అంగాంగ శ్రుతి మేళనం ఉండాలి.
   జమీం : అంటే?
   శ్రీనాథ : అనురూపత అని  నా  భావం. ఒక పొడుగు  మనుష్యుడు  తల, ముఖము, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఫాలం, చేతులు, హస్తతలాలు, వేళ్ళు, ఛాతీ, నడుం, కటి, పిరుదులు, తొడలు, పిక్కలు, పాదాలు  ఆ పొడుగుకు తగినట్లుగా వుండాలి. పొడుగువానికీ, ఛాతీ బాగా వెడల్పున్న వానికీ  పొన్నకాయలాంటి  చిన్న తలకాయవుంటే అనురూప రహితమన్నమాట.
   నేను : ఈ  అనురూప  నిర్ణయం  ఎట్లాగ?
   శ్రీనాథ : అనేక  యుగాలనుండి మనం  మనుష్య  రూపం ఎరిగి, ఉత్తమ పురుషుడికి  ఇంత తల, ఇంతంత  కళ్ళు మొదలైనవి వుండాలని  నిర్ణయించాము.
   నేను  : అంటే  మంగోలులకు  ఒక రకం  అనురూపనిర్ణయం, నీగ్రోలకు ఇంకోటి  వుండవచ్చు  నన్నమాటేగా!
   శ్రీనాథ : చిత్తం.
   రాజ : బెలూచీలకు  ఒకరకం, కాబూలీలకు  ఇంకో రకం, పంజాబీలకు  వేరేరకం, బ్రాహ్మణులకు వేరు, ముస్లింలకు  వేరు అలా  వుండవచ్చన్నమాట.
   శ్రీనాథ : అవునండీ!  ఈ  తేడాలు  మానసిక  సౌందర్య, ఆత్మసౌందర్యాల నిర్ణయాలలోనూ  వుంటాయి.
   నేను : ఇంక  ప్రాణశక్తి  సౌందర్యం  ఏమిటి?          
     శ్రీనాథ : ఒక  మనుష్యుడు  మందకొడిగా  వుంటాడు. ఇంకొకడు  హుషారుగా వుంటాడు.  చాకచక్యంగా  వుంటాడు.  ఎక్కడ  ఈ  మూడూ  ఉత్తమంగా  సంయోగం  అవుతాయో, అక్కడ భౌతిక  సౌందర్యం  వుందని  మేమంటాము.  అంగాంగ సమప్రమాణత  వున్నంత మాత్రం  చాలదండీ. ఆ  అంగాంగాలు  పుష్టిలో  రేఖలలో  సమప్రమాణంగా ఉండాలి. మొగవాడికి  కండలుకట్టిన  దేహం అందం. స్త్రీకి  కర్కశత్వం పనికిరాదు. మెత్తదనము, రేఖాస్పుటత్వమూ వుండాలి.