పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధానాలు కొన్ని చెబుతాను విను. ఆ సమాధానాలు నీ సందేహహాలకు సరియైన సమాధానాలు కావు. నీ సందేహ నివృత్తి నువ్వే చేసుకునేందుకు తోడ్పడుతాయి అంతే. నీ సందేహాలూ, నా మాటలూ సమన్వయంచేసి ఆలోచించుకో. నీకే నెమ్మదిగా జవాబులు దొరుకుతాయి అన్నాను.

    చిత్తం స్వామీజీ!
    భగవంతుడు  ఒక పెద్ద   మనుష్యుడుకాడు. అయితే  అతడు వున్నాడో, లేడో మనకు అక్కరలేదు.  ఆత్మ వున్నదని నువ్వు నమ్మవద్దు. ఆత్మానాత్మ  విచారణ. ఆస్తినాస్తి విచారణ, మానవ దైనందిన చర్యకు   సంబంధం కలుగజేసుకోనవసరములేదు. మతగ్రంథాలు చదవనవసరం లేదు. ఇక   అహింసనుగూర్చి,  పుణ్య, దయా, సత్యశౌచాలను గూర్చి  నేను స్పష్టంగా  మాట్లాడుతాను. జాతులను గూర్చి, దేశాన్ని గూర్చి చివర  నా అభిప్రాయం  చెప్పగలను. 
    చిత్తం. 
    హింస అంటే ఏమిటి? 
    మనుష్యుని  చంపడం, శారీరకంగా, మానసికంగా   మనుష్యుని  బాధ పెట్టడం. 
    కాబట్టి, మనుష్యుని  చంపడం  తప్పులేదు. చావగొట్టడం తప్పులేదు  మనుష్యుని  మానసికంగా  బాధ పెట్టడం  తప్పులేదు. అది మగతనం అది  మీ  వాదనా? 
    అంటే  ఏదైనా  మనుష్యలోకానికి  మంచిది  అని తోచిన  స్థితిని  తీసుకురావడానికి  అడ్డు అని  తోచే  మనుష్యులందరినీ  చంపవచ్చు, కొట్టవచ్చు, మానసికంగా బాధించవచ్చు. 
    ఇంకో  మనష్యులజట్టుకు వారికి  మంచిదన్నస్థితి-ఒకదాని  కొకటి  అడ్డంవస్తే  ఆ జట్టును  మీరూ, మీ జట్టును  వారూ  చంపుతూ  దారి  నిష్కంటకం చేయవచ్చునన్నమాట? ఈ రెండు జట్టులూ  సమానబలం  కలవి అయితే  ఒకదాన్ని  ఒకటి నాశనం  చేసుకొని  రెండూ మాయం కావాలి కదా! ఒకటి ఎక్కువబలం కలది  అయితే, రెండో దాన్ని నాశనంచేసి, తాను కొంత నాశనం అయి  తర్వాత  ముందుకునడవాలి. తీరా, ఆ  మంచిస్థితిని  పొందిన  తర్వాత  నాశనం  అయిన  జట్టు  తిరిగి  ఉద్భవిస్తే, మళ్ళీదాన్ని  నాశనం  చేస్తూ  ఉండాలి.  రెండోజట్టు  బలం  ఎక్కువయితే  ఈ జట్టు  నాశనం  అయిపోవాలి! ఇదేనా మీ  హింసాతత్వం? 
    అవునండి. 
   ఈ రకమైన  చరిత్ర  ఈ  మనుష్యలోకం  సంపూర్ణంగా నాశనం  అయినదాకా  ఉండాలని మీ వాదన! 
    అలా  ఉండాలని కాదు, ఉంటే ఉండవచ్చును. 
    అసలు  మనుష్యుడు , ఇంకో మనుష్యుని కోసం గాని, మనుష్యలోకం కోసంగాని ఎందుకీ  హింసంతా జరపడం?