పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

   జ్ఞానిమామండిలో  మా  సరుకులన్నీ  తనిఖీచేసి, కొద్ది  పన్ను విధించారు  టిబెట్టు రాజ్యాధికారులు. ఆ  దేశంలో  నన్నెరిగినవారు చాలామంది వున్నారు. అక్కడ  ఉద్యోగులకూ, నాకూ చాలా  స్నేహం. అవసరమైతే  దారిలో  దొంగలు మమ్ము  బాధించకుండా వుండటానికి  కొంతమంది తిబెత్తుపోలీసువారిని రక్షకులుగా  ఇస్తామని   వారంటే  మేము  చాలామంది  వున్నాము. మాకేమీ భయంలేదని  నేనన్నాను.
   జ్ఞానిమామండీ నుండి  మా జట్టు  బయలుదేరింది. మధ్య గ్రామాలు  ఉన్నా  లేకపోయినా,  శ్రీనాథమూర్తిడేరా, రాజపుత్ర  జమీందారుడేరా వేస్తే మాకందరికీ బాగా సరిపోయేవి. గుఱ్ఱాలకూ, చమరీమ్రుగాలకూ టార్పాలిన్ తో డేరాలు తయారుచేసి  వాని  నందులో కట్టేసేవారం.  కూలీలకు  టార్పాలిన్ తో  చక్కని గుడారం  నిర్మించేవారం.
   ఆ ప్రకృతి  సౌందర్యం  వీక్షిస్తూ  మూర్తి సర్వమూ మరచిపోయేవాడు. అతని  ధ్యానమంతా ఏదో  మహాభావసందర్శనాభిలాషియై  ఉరకలు  పెట్టుతూన్నది.  ఈ  మకాంలో   శ్రీనాథమూర్తి  నా  దగ్గరకు  వచ్చాడు. స్వామీజీ! భగవంతుడంటే ఏమిటి? అని చిన్న బిడ్డలా  ప్రశ్నించాడు. ఈ  విషయమైన చర్చ అతడు  చేసుకోక, గ్రంథాలు  చదవక     ఆ  ప్రశ్నవేయలేదు. అతనిలో  ఈ  పరమభావాన్ని  గూర్చి  శిశుత్వం  వచ్చింది. అదే కదా సాధకుని ప్రథమ స్థితి!
   నేను: నాయనా, భగవంతుడొక  వ్యక్తీకాదు; అఖండ  మానవుడూ కాదు. 
   మూర్తి: విష్ణు, శివ, అమితాభ, జెహోవాది భావాలన్నీ  మానవుని శక్తికి  కొన్నికోట్ల కోట్లరెట్లు శక్తిగల మూర్తిని  భావించినవే కాదా  ఆండీ? 
   నేను: అలా  మనుష్యులు  భావిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు తమకు సన్నిహితునిగా, పరమబంధునిగా   కూడ  భావిస్తారు.
   మూర్తి: అలా  భావించడంవల్ల  మానవునికి  స్వశక్తి నీరసించి, అస్వతంత్రత ప్రబలి  తన పురోగామిత్యానికి   తానే అడ్డుతగలడం కాదాండీ? 
   నేను: మనుష్య  దెందుకు  పురోగామి  కావాలి?
   మూర్తి: లేకపోతే  నశించిపోతాడు.
   నేను: ఋజువు చేయి.
   మూర్తి: ప్రకృతిలో  వస్తువులు  పెరగాలి. లేకపోతె నశిస్తాయి.
   నేను: సముద్రం  పెరుగుతోందా? కొండలు  పెరుగుతున్నాయా? ప్రపంచంలో  వున్న గాలి పెరుగుతోందా?
   మూర్తి: అవి  రూపాలు మారుతున్నాయి  గదాండీ.
   నేను: మనుష్యుడు  పెరుగునా? తక్కిన శక్తులు మారునా? ప్రకృతిలో  వస్తువులు పెరగాలి, లేకపోతే  నశించాలంటావేమి?
   మూర్తి: ప్రకృతి అంటే  చేతన ప్రకృతి  అని   నా  ఉద్దేశం.