పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాకిది పదిహేనవసారి కైలాసయాత్ర, కైలాసేశ్వరచరణాలకూ, నాకూ ఏదో విచిత్ర పవిత్రసంబంధం ఉండి వుండాలి. బదరీనాథ క్షేత్రంలోని అన్ని పుణ్యస్థలాలు శ్రీనాథమూర్తికి చుపించినాను. నారదశిల, నృసింహశిల, వరాహశిల, గరుడశిల, కుబేరశిల అనే పంచశిలలు: వహ్ని తీర్థము, ప్రహ్లాదతీర్థము, నారదతీర్థము, కూర్మతీర్థము, ఋషిగంగ అనే పంచతీర్ధాలు: చరణపాదుక, శేషనేత్ర, వేదధార, మాతామూర్తి, వ్యాసగుహ, భీమశిల అను షట్ పవిత్రస్థలాలు అతనికి చూపించి, శుభముహూర్తంలో కైలాస పర్వతోన్ముఖుల మయ్యాము.

   కొండ లెక్కుటలో అతి  జాగ్రత్తగా దారి  చూచుకోవలసివున్నది. అనేక  నదుల  లోయలు  దాటవలెను. వర్షాలు, వడగండ్లు  పడుట  ఎక్కువైనది. మానాఘాట్  ఈ  దారికంతకు  ఎత్తయిన  ప్రదేశం. ఇక్కడ  నిలుచుండి  శ్రీనాథమూర్తి నన్ను  చూచి  స్వామీజీ మనం  స్విడ్జర్లాండులోని బ్లాంకు శిఖరంకన్న ఎత్తయిన  ప్రదేశంలో ఉన్నామండీ అన్నాడు.
   ఆ  ప్రదేశానికి  ఎటువైపు  చూచినా  లోయలు  క్రిందకు  దిగిపోతున్నాయి. మేము  నిలుచున్న ప్రదేశం  అసలు  హిమాలయ శ్రేణికి వెన్నెముక. ఆ  వెన్నెముక  శ్రేణిలో ఎవరెస్టు,  గురుమాంధాతా, నందపర్వత, కాంచనగంగ, గౌరీశంకర, ధవళగిరి, గోడ్విను పర్వతశిఖారాలున్నాయి. అందులో  ఎన్నో  శిఖరాలు మాకు కనబడినాయి.
   మానాఘాట్  నుంచి  ప్రయాణాలు  చేసుకుంటూ  అడుగు  మాత్రం  వెడల్పుగల  దారుల  హిమపాత ప్రవాహాలపై  ప్రయాణించాము. ఒకచోట  ఆకాశమంటే పర్వతసానువు, ఈ  ప్రక్క  పాతాళమంటే లోయ. పర్వతాలు, నదులు, రాళ్ళూ, రోజుకు  ఆరు, ఎనిమిది  మైళ్ళకన్న ఎక్కువ ప్రయాణం చేయలేము. 
   
       
                                         
                                                                                                                         
           
               

ధాప్పానగరం హిమాలయ శ్రేణికి ఆవలివైపు పర్వతపాదాన ఉన్నది. ధాప్పానుండి పధ్నాలుగువేల అడుగుల ఎత్తునుండి పన్నెండువేల అడుగుల ఎత్తుకు జీలంనది లోయలోనికి దిగి, ఆనదీతీరాన చివలి చింగ్ గ్రామం చేరుకున్నాము. చివలిచింగ్ గ్రామమునుండి మూడురోజులు ప్రయాణం చేస్తూ జ్ఞానిమామండి నగరం చేరాము. ఈ నగరం పెద్ద వర్తకస్థానం. ఇక్కడే హిందూదేశ వస్తువులు, టిబెట్టువస్తువులు మారకం జరుగుతూ వుంటవి. ఇక్కడ చక్కని పాశ్మీనా ఉన్ని గుడ్డలు, శాలువలు కస్తూరి, శిలాజిత్తు, వున్ని మొదలైనవి తిబెత్తువారి అమ్ముతారు. ఆయుర్వేదౌషదాలకు పనికి వచ్చే ఓషధు లనేకం త్రివిష్టవులు ఈ నగరంలో అమ్ముతారు. వెండి బంగారము కడ్డీలుగా చేసి అమ్ముతారు.

   భరతదేశాన్నుంచి  నగలవస్తువులు, పగడాలు, ముత్యాలు, కుంకుమపువ్వు, తేయాకుడబ్బాలు, అత్తరు దినుసులు, అగరువత్తులు, ధూపసామానులు, పచ్చకర్పూరము, హారతికర్పూరము, బియ్యము, దూదివస్త్రాలు, ఇత్తడి, రాగి  మొదలైన  లోహాలు, అద్దాలు, దువ్వెనలు, దీపాలు, కొవ్వువత్తులు, సూదులు, కత్తెరలు, ఉక్కుసామానులు, ఇనుపసామానులు  ఇంకా  ఎన్నో  త్రివిష్టపానికి ఎగుమతి అవుతాయి.