పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39

   అక్కడినుండి  అలకనంద  ఆడుకునే ఆ ప్రదేశం  దర్శనం చేద్దామన్న మహాకాంక్ష పుట్టింది నాలో.  ఆ  తొమ్మిది  గంటలకు  ఆ  కొండ  ఎక్కడం  ప్రారంభించాను. ఎలా  ఎక్కానో,  ఎన్నిసారులు తూలి  పడబోయానో, జారానో, కూర్చున్నానో, దేకానో  తెలియదు.  పదిగంటలయ్యేలోపున  ఆ  అలకాపుర  ప్రదేశం  చేరాను. ఆ  ప్రదేశం  పద్దెనిమిదివేల  అడుగుల ఎత్తున  ఉంటుంది.  చుట్టూ ఇరువది  మూడు, ఇరువది నాలుగువేల అడుగుల  శిఖరాలెన్నో  అనంతంగా  కనబడినాయి. గాలి  అతివేగంగా విసురుతూ ఉంది. మంచుతో  నిండి, తెల్లటి నెరసిన  జుట్టు  శిఖలుగా ముడివేసిన  యోగి తపస్సు చేసుకొంటున్నట్లున్నది. ఒక చిన్న  కొండప్రక్క  ఉన్న  చిన్న గుహలో  చేరి, బిస్కత్తులు తిని,  థరమాస్  ప్లాస్కులోని కాఫీ  తాగి, స్కెచ్ తీసి పులకరాలతో  ఒక బొమ్మ  వేశాను. ఆ బొమ్మ  మధ్య  నాట్యమాడుతూ  ధవళాలక  అలకనందానది తోచినది. ఆనదీసుందరమోము మా  శకుంతల మోమే!                                                                                                                             
           
               

అలకనందా చిత్రము నేను వేయాలనే వేయలేదు హేమా! అలా వచ్చింది. ఆ గడియలలో అలా అలా ఎందుకు వేశానో నాకే తెలియదు. ఎంత అందంగా వచ్చింది, ఆ రూపం! నాతో ఐక్యముకాని నూత్న యవ్వన దినాల శకుంతలారూపం. ఒళ్ళు బంగారము, జుట్టు బంగాము, ధరించిన వస్త్రాలు హిమధవళాలు. హిమమే వస్త్రాలుగా నేసిన సౌందర్య మా రేఖలలో వంపులలో దృశ్యమైనవి. ఎటుచూచిన హిమం. లోయలలో దేవదారు వృక్షాలు, ఘనీభూత హిమవృత పర్వతసానువులలో అంతర్వాహినులై అనేక దివ్యనదీబాలలు. వారెప్పుడూ బాలలే. నిర్ఘరీసుందరులు కొందరు. నిత్య యౌవనులు. త్రిదశ ప్రౌఢాంగనా స్థితి పొందేవారు. గంగా యమునానది నదీమతల్లులు.

   హిమాలయంలో  ప్రతిప్రదేశం  ఎవరు  తిరుగగలరు? ఆ రహస్యాలను  ఎవరు  తెలిసికొనగలరు?  మహాకవులీ  మహాప్రదేశాలను వర్ణించి  వర్ణించి, చాలలేకపోయినారు. మనుష్య దేశాలమధ్య  మనుష్యుల కందని  మాయా ప్రదేశమై  విస్తరించి  ఉన్న  ఈ  విచిత్ర  పంథాలలో  మనుజునకు పనియేమి?  మనుష్యుని  దుఃఖాలు,  ఆనందాలు, ఆవేదనలు, కాంక్షలు, సంతృప్తులు హిమాలయేశ్వరునకు  తెలియనవసరమేమి? అని అతని పాదాలనైనా అంటునా? 
   ఆ  స్థలంలోని  మహాదానంద  మత్తతలోనుంచి విదల్ఛుకొని, ఎట్లుదిగానో, లోయలోనికి ఎల్లానడిచానో, ఏ దిక్కున  వచ్చానో,  మెలకువ వచ్చేసరికి  శతధారదగ్గర ఉన్నాను. శతధారా  సౌందర్యం  వర్ణనాతీతమే. అక్కడ  నూరుధారలు నూరువివిధ శ్రుతులతో నారదమహతీ వీణానాదం  చేస్తూ పడుతున్నవి. అచ్చటి పూవులలో  ఒక మహాపుష్పము  నాకు దర్శనమిచ్చింది. ఆ పుష్ప సౌందర్యం  నేనేమి వర్ణించగలను? తెల్లని రేకులు, కాశ్మీర కుసుమవర్ణ  హృదయం  రెండువందల పుటాలున్న   కమలాలకన్న  పెద్దది. ఎన్నో తుమ్మెదలు  ఆ పుష్పంలో