పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎత్తయై, స్నిగ్ధహిమంతో నిండి, స్వచ్ఛమూర్తులతో ప్రాపంచిక సంబంధమేమీ లేకుండా ఆ రహస్య ప్రదేశాలలో ఆకాశపథగభీరవదనులైన శీతనగేంద్రశిఖరదేవులు నన్ను పూర్తిగా తమ హృదయానికి హత్తుకొన్నారు. వారితో నా ఆవేదనలు మూగభాషలో చెప్పుకొన్నాను. ఎలాగైనా ఆ శిఖర మూర్తులను చేరాలనే కాంక్ష నా కెక్కువైంది. చలి లెక్కచేయలేదు. రాత్రిళ్ళు మంచు కురుస్తున్నా వంటినిండా బచ్చుకోటులూ, తోలుకోటులూ తొడుగుకొని ఆ వెన్నెలలో బదరిలో ఒంటిగా తిరిగాను. స్వామీజీ నన్ను చూచి ఏమీ అనలేదు.

   శీతలతీవ్రత  వర్ణింపలేను.  వెన్నవలె  మంచు కురుస్తూ ఉన్నది. ఒంట్లో  రక్తం ప్రవహించడానికి,  అటూ ఇటూ  పచారుచేస్తూ  తెల్లవారగట్ల  మంచు కురవడం  ఆగగానే  అలకనంద పుట్టిన ప్రదేశానికి బయలుదేరాను  ఒక్కణ్ణే, దారి మంచుపడి  వుంది. నా  కాళ్ళకు  పెద్ద జోళ్ళున్నాయి. హిమాలయ ప్రయాణపు జోళ్ళు, వాడిసూదులున్నవి  తొడుగుకొని, సంచినిండా బిస్కట్లు, చిన్నస్టవ్వు,  కాఫీపొడుం, పాలడబ్బా వేసుకొని బయలుదేరాను. ఒక్కణ్ణి వెళ్ళాలనే  దీక్షపట్టి వెళ్ళాను. స్వామీజీకి  ఒక  చీటీ  వ్రాసి  బయలుదేరాను.
   చీకటిలేదు. ఒక రకమైనసంధ్య.  నిశ్శబ్ధం  లోకమెల్లా  ఆవరించి ఉంది.  దారితప్పిపోతుందని భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు. ఆ  చుట్టుపక్కల లోయలలో  ఏ  దారైనా  బదరీనాథ్ కే చేరుతుంది.  ఏదైనా  అలకనందలో  కలుస్తుంది.  చేతిలో  ములుకఱ్ఱ ఉన్నది. నడక సాగించాను.  కొండప్రక్కనే మనుష్యులునడిచే  దారి,  దారికి దిగువ  ఎక్కడనో అలకనంద  సంగీతం  పాడుకుంటూ  ప్రవహిస్తున్నది.  ఎదురుగా,  వెనకగా, ప్రక్కగా ఆకాశాన్నంటే కొండలు. ఒకచోట   కొంచెం  దిగుతున్నా, మొత్తం ఎక్కటమే. పదకొండువేల అడుగులనుండి  పధ్నాలుగువేల  అడుగుల  దూరం ఎక్కాలి. అక్కడ వున్నది  అలకాపురం.
   తెల్లవారగట్ల  నాలుగింటికి  బయలుదేరి  తెల్లవారేసరికి బదరికి ఆరుమైళ్ళు  ఎగువకు  ఎక్కాను. అక్కడ ఆ అతిశీతలంలో  దారిప్రక్క  ఒక  పెద్ద రాతిపై కెక్కి   కూర్చుండినాను.  ఆకాశంలో  వెలుగు  పూర్తిగా  వచ్చింది. ఎఱ్ఱటి  కిరణాలు మబ్బుల్ని వివిధాంతరాలైన  బంగారు  రంగులతో,  నారింజ రంగులతో  అంతటా కమ్మివేశాయి. పేరు  తెలియని  కొన్ని  హిమాలయ శిఖరాలు గులాబిరంగులు  తాలుస్తున్నవి.  అలకనంద  లోయలో  మాత్రం  చీకట్లు  పూర్తిగా పోలేదు.  పర్వతసానువుల  పరచివున్న తెల్లటిహిమం, ఉన్నకాస్తవెలుగునూ  ద్విగుణీకృతం చేసి, లోయలను  వెలిగిస్తున్నది. 
   ఏమీ  ఆలోచనల్లేని  ఆనందంలో  మునిగిపోయాను. ఏమి  చూస్తున్నానో  నాకు తెలియదు. ఎన్నో  వింత వింతలైన  పక్షులు, ఎన్నో  విచిత్ర గాంధర్వ గీతాలు ఆలపించుకుంటూ ఎగిరిపోతున్నవి. వానిని  గమనించకుండానే కూర్చుంటిని. ఎన్నో  మనోహరమైన  పుష్పాలు   కని  విని ఎరుగనివి   ఆ  కొండ  చరియలలో