పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా దివ్యసుందరీ, నా ఆత్మేశ్వరీ, నా జీవిత సింహాసనరాజ్ఞీ! ఏమయిపోయావు దేవీ! నాకు కనబడవా........?

   ఇలా  అనుకున్నానో  లేదో, నాకు దిగువగా రోడ్డు ప్రక్క తపస్సు  చేసుకునే  స్వామి  శకుంతలగా  మారిపోయారు. శకుంతలదేవి చటుక్కున లేచింది. ఇటూ అటూ  చూడకుండా బదరివైపు  ప్రయాణం  సాగించింది.  నాకా  అతిశీతల  ప్రదేశంలో  చెమటలు పట్టాయి.  ఆమె  అతివేగంతో  నడిచింది.  ఆకాశంలోకి తేలిపోయింది.  అలా  తేలుకుంటూ  బదరీనారాయణ  విశాలలాల్ జీ మందిర  శిఖరంలో  కలిసి  మాయమైపోయింది.  నాకు కళ్ళనీళ్ళు  జల జల  ప్రవహించి పోయినాయి.
   బదరీనాథా! నువ్వేనా  నా  శకుంతలవు?  నువ్వేనా?  అది ఎలా  సంభవించిందీ?  తండ్రీ  నువ్వున్నావా?  నా  శకుంతల  ఉన్నదా? నేనున్నానా?  నా స్వామీజీ,  నా శకుంతలా, నా బదరీ  అన్నీ ఒకటేనా?  ఇది  ఏమివెఱ్ఱి? నాకీ  విచిత్ర  పర్వత  ప్రదేశాలలో  మతి  తిరిగిపోతున్నదా? క్రిందకు  దిగివచ్చాను.  స్వామీజీ  లేచి  బదరీనాథ్ వెళ్ళారని  అక్కడి  వారందరూ  చెప్పారు.  నాకు   గుండె  గతి  తప్పి  పోయింది.  కన్నుల నీరు  కారిపోయింది.
   అందరమూ  బయలుదేరాము.  బదరికి  ఒక్కొక్క  అడుగు  ముందర  బడుతూన్నది.  బదరికి   ఈవలావల  నరనారాయణ పర్వతాలున్నవి.  దిగువ   మహావేగంతో  అలకనంద  ప్రవహిస్తున్నది. విశాల బదరీలాల్జీకీ  జై అని కేకలు  ఆ  ఉదయకాలంలో   ఏవో  మహారాగాలతో  వినిపించాయి.  ఆ  శ్రుతులలో  ఏవో  దివ్యసంగీతాలు, ఆ  సంగీతాలు  స్వరాలై, ఆ స్వరాలలో  కలిసి  శకుంతల కంఠం  తీయతీయని  పాటపాడుతూ నాకు  వినబడింది.  నరనారాయణ పర్వతాలూ,  బదరీనారాయణ దేవాలయమూ  కళ్ళారా చూస్తూ  నిలుచుండి పోయాను. సంగీతం వినబడుతూనే వున్నది.  తక్కిన వారు  జయజయధ్వానాలు  పలుకుతూ  నడిచి పోతున్నారు.  నేను మాత్రం  అదృశ్యయై ఉన్న  ఆ  దేవి  సంగీతం వింటూ నిలిచిపోయాను. ఆ  సంగీతం  అతిమధురమైనది.  గాఢతమవేదనా  భరితమైనది.  ఆ  గాంధర్వమును,  కిన్నెరలతో  కలిసి  పాడుతూ  గంధర్వాంగనలతో  నృత్యంచేస్తూ  శకుంతలాదేవి  అమృత  ప్రవాహాలు  దెసల నింపుతున్నది కాబోలు? ఆ  పాట  ఇదియని చెప్పలేను.  ఆ  రాగమిట్టిదని  గ్రహించలేకపోయాను. ఆ  తాళ మేదియో  హృదయమునకు  వ్యక్తంకాలేదు. 
   ఎంత  ఆనందరూపమైనది  ఆ పాట! ఆ  పాటలో మంచుగడ్డలు  కరిగిపోయినవి.  ఆ  స్వరకల్పనలో  నదులు ఉద్భవించి  ప్రవహించినవి. ఆ రాగారోహణలో  హిమాలయ శిఖరాలు  ఆకాశంలోకి  చొచ్చుకుపోయాయి. అవరోహణలో  పుష్పవన  వాటికలు  ఆ లోయలలో వికసించి  సురభిళాలైనవి.