పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపదేశాలు, ఆగమాలు, పాశ్చాత్యుల వేదాంతాలు అన్నీ సర్వకాలం చదువుతూ ఉంటారు. హరిద్వారంలో వీరు మానస సరోవరాశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమంలో గ్రంథాలయం ఉంది. అన్ని భాషలూ నేర్చుకున్నారు. త్రివిష్టపపు వ్రాత గ్రంథాలెన్నో సముపార్జించారు. అనేకమంది సన్యాసులు వీరి ఆశ్రమానికి గ్రంథపఠనంకోసం వస్తారు. వీరి శిష్యులు దేశం అంతా వున్నారు. కోటీశ్వరులు, మహారాజులు, దరిద్రులు యెంతోమంది వీరి శిష్యులు. బీదసన్యాసులకు సర్వసహాయాలు చేస్తూ ఉంటారు. వీరు పూర్తిగా అహింసావాదులు. గాంధీగారు అవతార పురుషులనే వీరి ఉద్దేశ్యం. మూడు నాలుగు సారులు వీరా మహాత్ముని సందర్శించారు.

   వాదనలో  మా  స్వామీజీని  జయింపలేము. వాదన  అవసరంలేకుండా  హృదయానికి  అమృతభోజనం   ఆరగింపజేస్తారు. వారి  ఉపదేశాలల్లో, వీరి మహాత్మ్యం  చాలా  గొప్పదని  హరిద్వార   హృషీ  కేశాదులలో  అనేకులు మాతో చెప్పారు. హాస్యంచేసి  నవ్విస్తారు.  మోమాటం లేకుండా  అన్ని  విషయాలు చెప్పుతారు.  ఎప్పుడు కునుకుతారో  నేను  కని పెట్టలేకపోయాను. ఎప్పుడూ  చదువుతూనో,  జపం చేసుకుంటూనో  కనబడుతారు.  స్వామీజీ  మంచి  గాయకులు,  సైగల్ గొంతును  మించిన  తీపి మందిరం  గొంతుతో  జపాదులు లేనికాలాల్లో, ప్రయాణం  చేసేటప్పుడు,  రాత్రిళ్ళు  యెప్పుడూ తత్త్వాలు పాడుకుంటూ  ఉంటారు.
   హృషీకేశం నుంచి  దేవప్రయాగ  వెళ్ళాము. మోటారు బస్సుపై పదిహేను  గురు స్వాములు, మా  స్వామీజీ, నేనూ  ఒక  రాజపుత్ర  జమీందాడుడూ, సిబ్బందీ, అందరము  అరవై  నలుగురము. ఒక  జట్టయి  హిమాలయ యాత్ర ప్రారంభించాము. ఇంతవరకు  స్వామి   నాకేమి  బోధించ  ప్రయత్నించలేదు. నేను  ఆయన్ను  ప్రశ్నలూ వేయదలచుకోలేదు.  మా  అమ్మగారి  దగ్గిరా, మా  సుబ్బులు  దగ్గిరా  సెలవు పుచ్చుకొని, బస్సుమీద  దేవప్రయాగ చేరాము. మా  అమ్మగారు  ఎంతో  ఉత్సాహంతో  అత్తవారింటికి కొడుకు  వెల్లేటప్పుడుండే  సంతోషంతో సుఖంగా వెళ్ళి, కైలాసేశ్వరుని  దయచేత  కులాసాగా  తిరిగిరా  నాన్నా అని  ఆశీర్వదించింది.
   ప్రయాగ  అంటే  నదీ  సంగమ  క్షేత్రం.  అలహాబాదు  మనుష్య ప్రయాగ, అలకనందా భాగీరధీ  సంగమం  దేవప్రయాగ. కర్ణ, నంద, రుద్ర, విష్ణు ప్రయాగలున్నాయి. అసలు గంగానది  భాగీరథి. భగీరథుడు గంగోత్రి  కని పెట్టినాడు. కాబట్టి  భాగీరథి అని పేరు వచ్చింది.  ఉన్న ప్రయాగలన్నీ అలకనందానదికే ఉన్నాయి.  భాగీరథిలో చాలా నదులు  కలుస్తున్నా  వాటికి ప్రయాగలనే  పేర్లు లేవు. అలకనందలో  మందాకిని  నది కలిసేచోటు రుద్రప్రయాగ.  అలకనందలో  పిండారీగంగ  కలిసేచోటు  కర్ణప్రయాగ; నందప్రయాగలో  నందానది   అలకనందలో  సంగమించే పుణ్యస్థలం. విష్ణుప్రయాగలో  విష్ణుపాదజ  అయిన  విష్ణుగంగ  లేక  ధౌళీగంగ  అలకనందలో కలుస్తుంది.