పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్యాగతికి ఏ విధమైన ఉద్యోగమూ లేదు, కాని గొప్ప శిల్పీ, చిత్రకారుడూ. నాకూ, అతనికీ అడయారులో ప్రథమపరిచయం కలిగింది. అతని మూర్తిలోంచి ఏదో సమ్మోహన శక్తి నన్నాకర్షించింది. మా పరిచయం గాఢమై స్నేహంగా పరిణమించింది. సుర్యుడన్నా కాలం విషయంలో అశ్రద్దగా ఉంటాడేమో కాని త్యాగతి రోజూ సరిగా, సాయంత్రం అయిదు గంటలకి మా యింటికి వచ్చేవాడు.

త్యాగతికి ముప్పది సంవత్సరముల వయస్సు ఉంటుంది.ఖద్దరు తప్ప యితర దుస్తులు ఎప్పుడూ ధరించడు. ఆ దుస్తులు ఎప్పుడూ అందంగా కుట్టబడి ఉంటవి. అవి ఎంతో శుభ్రముగా ఉంటవి. త్యాగతి ఎప్పుడూ ఏదో అతిసున్నితమైన సువాసనా ద్రవ్యాన్ని ఉపయోగిస్తాడు. వేసవికాలంలో వట్టివేళ్ళ అత్తరు, వానాకాలంలో మల్లి అత్తరు, శరత్కాలంలో కేతకి, శీతాకాలంలో హేన్నా, వసంతంలో గులాబి అత్తరు వాడేవాడు. ఏనుగు తల చెక్కిన చక్కని పొన్నుకఱ్ఱ అతని చేతిలో ఎప్పుడూ ఉంటుంది.

త్యాగతికి నా రహస్యాలన్నీ చెప్పబుద్దివేస్తుంది; కాని ఏమీ చెప్పలేను.నా జీవితంలో ఎప్పుడైనా ఏ ఉపద్రమయినా సంభవిస్తే త్యాగతి పట్టుకొమ్మ కాగలడనే విపరీత ధైర్యం నన్నావవరించి ఉంటుంది, ఎందు కమ్మా నీకీ ధైర్యం అంటే అందుకు జవాబు చెప్పలేను.

                                                                                                       6

ఈ నలుగురు స్నేహితులూ కొంచము హేచ్చుతగ్గుగా రోజూ మా యింటికి చేరుతూ ఉంటారు. అయిదుగురం కలసి సినిమాలకి పోతూ ఉంటాము. లేదా మా కారుమీదో మనోహర ప్రకృతి నాట్య ప్రదేశాలకి విహారార్దము వెడుతూంటాము.

ఆరోజు " గార్బో " నర్తకి నటించిన " క్వీన్ క్రిస్టినా " చిత్రాన్ని చూస్తున్నాం. ఇద్దరు ఐటు ఇద్దరు అటు మధ్య నేను, నా కుడివేపున కల్పమూర్తి, ఎడమవేపున తీర్ధమిత్రుడు. కల్పమూర్తి ప్రక్కన నిశాపతి వున్నాడు, తీర్ధమిత్రుని ప్రక్కన త్యాగతి వున్నాడు. మంచుతెరల మధ్య హోటలులో చిక్కుపడిపోయిన క్రిస్టినా రాణి అఖండ ప్రణయ సముద్రంలో పడిపోయింది. ఆ ప్రణయం యొక్క విచిత్ర స్థితి అభినయించదగినది ఒక్క గార్భోయే!

ఆమె ప్రణయం చూచి, తీర్ధమిత్రుని రక్తము వుప్పోంగి పోయింది. తీర్ధమిత్రుడు నా ఎడం చెవిదగ్గర పెదవి పెట్టి అన్నాడు: " దేవీ! మా జీవితానికి మహారాజ్ఞిని. లక్ష్మీని హృదయంలో మాత్రమే ధరించాడు విష్ణువు. శివుడు పార్వతిని అర్ధదేహంలో దాచుకున్నాడు.తన సరస్వతిని బ్రహ్మ నాలుక మీద మాత్రమే నాట్యమాడిస్తున్నాడు. కాని నిన్ను నేను నా జీవిత సర్వసము నింపుకొని పులకరించి భువనాలు నిండిపోతాను."