పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"పిచ్చిమాటలు మాట్లాడక చిత్రం సరిగా చూడవయ్యా " అని విసుగుగా అన్నాను.

తీర్థమిత్రుడు మళ్ళీ నాచెవిలో "ఎన్నాళ్ళిల్లాగా ఒంటిగా వుంటావు? రాణీ క్రిస్టినా కూడా, తనకూ తన జీవితానికీ ఏమీ అడ్డం రానివ్వలేదు, చూడూ?"

"స్స్"

ఇంక కొంతసేపటికి కల్పమూర్తి నెమ్మదిగా నా చెయ్యి పట్టుకున్నాడు.

" ఎం మెత్తగా, నున్నగా ఉంది ! ఎంత అందంగా ఉంది ! " అన్నాడతను.

" మూర్తీ ! మీ రెవ్వరూ నన్ను కథ చూడనివ్వరేమిటి ? "

నా హస్తతలం అతని యెడమ చేతిలో ఒక్క నిమేషం ఇమిడి వుంది.

ప్రణయ కల్పనలు, కాంక్షాపూరిత అస్పష్టవాక్యాలు, నిగూఢతా నిబిడమైన వ్యంగ్యకలాపాలు, పుంఖానుపుంఖాలుగా నన్ను ముంచివేయగా నిశాపతి కారు నడుపుతూన్న నా పక్క కూర్చున్నాడు.

" నువ్వెవరవు ? మహాగాయకుని గాఢరాగానివి, నా గొంతుకలో మిన్నే రురవడై బంగారు ఝురులతో ప్రవహించి పోదువుగాని; నా హృదయంలోని మూర్చనల తాళాలకు ధిమి దిమింకిత నృత్యం సలుపుదువు గాని. "

" క్రిస్టినా చూచి అందరికీ మతిపోయినట్లుంది " అన్నాను నెమ్మదిగా. కానీ సౌస్టవములై , మేలిమి బంగారు చ్చాయలతో మిలమిలలాడుతూ ఉన్న వక్షోజాల వెనక దాగి ఉన్న నా యువతీ హృదయమ్ నిర్వచింపలేని ఆనందంతో వివశత్వం పొందింది.

ఎవరి ఇళ్లకడ వారిని దింపి, నేనూ, త్యాగతీ మా ఇంటికి చేరుకున్నాం. కారును షెడ్డులో పెట్టి ఇద్దరం ఇంట్లోకి వచ్చాం. సిగరెట్టు తీసి వెలిగించి పొగ వదులుతూ నాపక్క మౌనాలంకారుడై నడచి వస్తూన్న శర్వరీభూషణుని చూడగానే, నా మెదడులోని మత్తులు పటాపంచలైనాయి. ఆటలాడి అలసట పడిన చిన్న శిశువునై పోయాను.

ఉస్సురని నిట్టూర్పు అప్రయత్నంగా నా హృదయంలో నుంచి వచ్చింది. కొంచెం తూలి ముందుకు పడబోయాను, తల్లి చెయ్యిలాంటి చేతిని నా వీపున ఆనించాడు త్యాగతి.

' హేమూ ! క్రిస్టినా కథ ఎవరినైనా తలక్రిందులు చేస్తుంది. కొంచెం పళ్ళరసం తాగి ఏ ఆలోచనా లేకుండా పడుకొని నిద్రపో. సుడిగుండంలో దూకడం మొదట్లో ఆటగానే ఉంటుంది.

నా కేదో భయం వేసింది. త్యాగతి భుజంమీద చెయ్యివేసి ఒక నిమిషం కదలకుండా నుంచున్నాను.

త్యాగతి మౌనమే అత్యంత శమనమయింది.

ఇంట్లోకి వెళ్ళగానే సాత్కుడి బత్తాయిపండ్లు కోసి, రసం పిండి, వడబోసి, అందులో ద్రాక్షాసవం అరఔన్సు వేసి త్రాగమని నా చేతికిచ్చాడు