పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంతలో స్వామి లోపలనుంచి మావద్దకు వచ్చారు. మేమంతా లేచి నుంచున్నాము. స్వామీజీ మోము అంత అందమైనది కాదు. కాని ఆ మోములో ప్రసరించే అద్భుతమైన కాంతులు నేను వర్ణింపలేనివి, అవి ఆ గదంతా వెలిగించినట్లే నాకు తోచింది. ఆరడుగుల పొడవు, డబ్బపండు చాయ, ముప్ఫయి ఏళ్ళు పైన ఉండవచ్చును. నాకు మాత్రం ఆయన ఇరవై ఏళ్ల యువకునిలా కనుపించారు. మమ్మల్నందరినీ కూర్చుండ నియమించి, స్వామీజీ చిరునవ్వుతో నావైపు చూచి, బాబా! నా ఈడు యెంతని నీ ఉద్దేశంఅన్నారు.

   నేనాశ్చర్యంతో  చిత్తం! చిత్తం! ముప్ఫయి  ఉండవచ్చును అన్నాను.
    నా  కిప్పుడు  ఏభై  ఆరేళ్ళు!  నీ  వంత   ఆశ్చర్య  పడనక్కరలేదు. మా  గురువుగారికి  తొంబది ఏళ్లున్నాయి. ఆయన  నాకన్న చిన్నవారుగా కనబడతారు. నీ  హృదయంలో  అనుమానాలు   పూర్తిగా వదలలేదు. వదిలితే   నువ్వు అందరితోపాటే  అవుతావు. మూర్తీ!  నీ  పేరు నాకు మంత్రశక్తివల్ల  తెలియలేదులే....మీ  వాళ్ళే చెప్పారు, నీ  భార్యపోయింది.
   నీ  భార్యను  నువ్వు  అతిగాఢంగా  ప్రేమించావు. దాంతో నువ్వు  డ్రైవరులేక  పరుగెత్తే   మొటారుకారు  వయ్యావు. ఆ  కారు చివరకు గంగలో ఉరికింది. నువ్వు వట్టి  భ్రమవల్లనే గంగలో ఉరికావని నాకు  తెలుసును. బాబా! నేను నీకోవైద్యము  చెబుతాను. నువ్వు  నాతో  కైలాసయాత్రకు  రా. మీ అమ్మగారు, ఈ సుబ్రహ్మణ్యం  మీ మేనమామల  ఊరు  వెడతారు.
   మా అమ్మ  భయంతో  చేతులు  జోడించి, స్వామీ, మా  అబ్బాయిని  నేనెలా వదలి ఉండగలను? అన్నది. 
   అమ్మా! భయపడకండి. నన్ను నమ్మండి.  ఆరునెలల్లో  మీ అబ్బాయి  తిరిగి  మీ  ఇంటికి వస్తాడు. ఈలోగా  మీకో  చిన్న మంత్రం ఉపదేశిస్తాను. అది మీరు  పునశ్చరణ చేసుకుంటూ  ఉండండి.
   మా అమ్మ స్వామివైపు చూచింది. ఆయన మోము, పాదాలు రెండుసార్లు  తిలకించింది. తమ  ఆజ్ఞకు  నేను బద్దురాలను అన్నది.
   నాకిదంతా ఆశ్చర్యంగా వుంది. నేను కైలాసమూ  రాను, గియలాసమూ, రాను అనడానికి సిద్దంగా ఉన్నాను. స్వామీజీ నావైపు చూచి, బాబా! నువ్వు నాతో  కైలాసపర్వత  దర్సనానికి   రా. అక్కడ అందమైన  ఆడపిల్ల   లెవరూ  లేరు. నువ్వు భక్తితో  ప్రార్థనలు  చేయనక్కరలేదు.  నీకు దైవము వద్దు.  నేను  దైవాన్ని  నమ్ము అని నీతో  ఒక్కమాటూ అనను. ఆ మాట నీకు ఇస్తాను. కాని  క్షతమైన నీ  హృదయానికి  శాంతి  ఆ  ప్రయాణంలో  లభించి  తీరుతుంది. నీ  మనస్సులో  ఉన్న  అనుమానాలు  ఆ నిర్మల  నిశ్చల  ప్రదేశాలలో  నివృత్తి అవుతాయి.  ఆ  ప్రదేశాల  అందమే నీకు  భోజనం అవుతుంది. ఆ  ప్రాంతాలనుండి  మనం  తిరిగి వచ్చిన  తర్వాత  నీ  ఇష్టం వచ్చినట్లు  నువ్వు సంచరించు. నా  అభ్యంతరం  లేదు. నేను నిన్నేరకమైన  వాగ్ధానమూ  ఇమ్మని కోరను అని అత్యంత  గంభీరంగా  పలికినారు. నేనవశుడనై  తప్పక వస్తానండీఅన్నాను.