పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్తాను అంటూ ఆమె నా వైపు క్రోధారుణ నయనాలతో చూచింది.

   మా వాడు  ఆమెకు  నమస్కారంచేసి, అమ్మా! మావాడు  చాలా జబ్బులో ఉన్నాడు. రెండుసార్లు చచ్చి బ్రతికాడు. అతని మనస్సు సరీగా లేదుఅన్నాడు.
    ఒరే  సుబ్బులూ  నీ కెందుకురా  నా  గొడవ? అన్నాను. ఇంతలో  లేచాడో గాహర్వాల్ రాజపుత్రుడు. ఇస్ లుచ్చేకి బాత్ సున్కర్,మేరా  బదన్  జల్ రహా హై.(ఈ  తుచ్ఛుని మాటలు  వింటోంటే నా వళ్ళు  మండిపోతుంది) అంటూ నాదగ్గరకు వచ్చాడు.  నేనూ లేచాను. 
   నా పూర్వబలం పూర్తిగా పోలేదు. ఇద్దరం  ఇంకో నిమిషంలో  ఎంత కొట్టుకొందుమో, మా సుబ్బులూ, నన్ను  చివాట్లు  పెట్టిన  ఆ  లక్నో  వీరనారీ  లేచి  మా ఇద్దరి మధ్య అడ్డం వచ్చారు. వాళ్ళిద్దరూ  ఆ రాజపుత్రునికి  సర్ది చెప్పారు.
   మా అమ్మ  లేచి  ఆ రాజపుత్రునికి  నమస్కారం చేస్తూ  కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా  తెలుగులో  అయ్యా, వాడు నాకు ఏకపుత్రుడు. రెండు  సార్లు చచ్చి బ్రతికాడు. మనస్సు సరిగాలేదు. రక్షించు నాయనా! వాడి మీద దేబ్బపడితే  చచ్చిపోతాడు. వాడు చస్తే  నా  ప్రాణం  వెంటనే పోతుంది అంటూ  గజగజ  వణికిపోయింది.
   ఆ  రాజపుత్రుడు నెమ్మదించి ఫరవానై  మాయీ! అని కూర్చున్నాడు. నేనూ కూర్చున్నాను.  రైలు హరిద్వారం  వచ్చింది. హరిద్వారం గంగానదికి  కుడివైపున ఉంది.  హిమవత్పర్వతాల  వెలువడి గంగానది ఆర్యావర్త  సమపథాలలో   ఇక్కడనే  ప్రవేశిస్తుంది.  స్టేషనులో దిగాము. ఓ  గంగాపుత్రుడు  మమ్మల్ని  సత్రంలోకి  తీసుకుపోయాడు. వెంటనే గంగకు పోయి  హరికాచరణ్ ఘట్టంలో  స్నానం చేశాము. నేను  స్నానం చేయడం  పుణ్యంకోసం కాదు. అది  హరిచరణ ఘట్టమైనా  ఒకటే  అసురచరణ ఘట్టమైనా  ఒకటే. స్నానంచేసే ఆడవాళ్ళూ, వేసవికాలంలో  స్నానవాంఛా  తప్ప  మరేమీలేదు. మా  అమ్మగారూ, సుబ్బులు  అతిభక్తితో  స్నానంచేసి  అయిదారు  రూపాయలు  ఖర్చు చేశారు. వాళ్ళు దగ్గిరనే ఉన్న  గంగాద్వార  మందిరంలోకి వెళ్ళారు.  నేను బజారు  చూసుకుంటూ  సత్రంలోకి వచ్చి  కూర్చున్నాను.
   ఇక్కడ  హరిద్వారంలో  రకరకాల  సుందరాంగులు  నా కంట పడ్డారు. ప్రపంచం స్త్రీ  సౌందర్యంతో  నిండినట్లే  నాకు  కనిపించింది. రైలులో  ఆ లక్నో  వనిత  అన్న  మాటలు  నా మనసు  కలత పెట్టుతున్నవి. నాకు  ఆ రాజపుత్రునిమీదా  ఆ లక్నో  స్త్రీమీద  పట్టరాని కోపం  లోపల కతకుత లాడుతున్నది.  మేము ఉన్న గదిముందు   వరండాలో  బోనులోని జంతువులా తిరుగుతున్నాను.