పుట:Thimmarusumantri.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

77


చుండెను. అతిగోప్యమైయున్న యీదుర్వర్తన మొకనాఁటి ఱేయి తిమ్మరుసుకంటఁ బడియెను. అప్పుడు తిమ్మరుసుమంత్రి యచ్చెరువునందుచు దాను మిక్కిలి నొచ్చుకొని యాతని వెంబడించి పోయి యాతఁడు చిన్నమ్మగృహము ప్రవేశించినవెనుకఁ దానును బ్రవేశించి నానావిధములఁ జీవాట్లుపెట్టి నీతులెన్నో యుపదేశించి దానంగలిగెడి మహోపద్రవమును నచ్చఁజెప్పి మరల రాజభవనమునకుఁ గొనివచ్చెను. కృష్ణరాయఁడు సిగ్గుపడియు భయపడియు నూరకుండక యొకింతతెగింపునకు సాహసించి 'అప్పా! ఏమని చెప్పుదు. ఆమెయెడ నాకుఁ బ్రేమ మగ్గలమై యున్నది. ఆమెను విడిచి నేను బ్రదుకఁజాలను. ఆమెను వివాహము చేసికొందునని వాగ్దానము చేసి యున్నాఁడను. రాజ్యవియోగము నైన భరింపగలను గాని యామెతోడి వియోగమును భరింపఁజాల. నాకెట్లు సామ్రాజ్యమును సమకూర్చి పెట్టితివో అట్లే నాప్రాణనాయిక యైన సర్వాంగసుందరిని నాకు సమకూర్చిపెట్టుము. మాయనురాగము విధివిహితమైనది. దీని వెడఁభాపుట కెవ్వరును సమర్దులు కారు. ఇవిగో నామానప్రాణధనంబులు నీకు సమర్పించుచున్నాఁడ " నని దైన్యభావము దేఁటపడఁ బలుకుచు బహుభంగుల వేడుకొనియెసు. అప్పుడు తిమ్మరుసు దీర్ఘముగా నాలోచించి యిఁకఁ దాను ప్రతిబంధకములఁ గల్పించి వారల నెడఁబాపుట తనకును సామ్రాజ్యమునకుఁ గూడ ముప్పు వాటిల్లఁజేయునని గ్రహించి