పుట:Thimmarusumantri.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠప్రకరణము

తిమ్మరుసుకారుణ్యము

అట్లు తిమ్మరుసు కృష్ణదేవరాయని సామ్రాజ్యాభిషిక్తుని గావించిన వెనుక నొకనాఁడు రహస్యముగా నతనికడకుఁబోయి మహాప్రభూ! పూర్వాచారము ననుసరించి పట్టాభిపేకమునకు ముందు వీరనరసింహదేవరాయని పుత్త్రుఁడైన తిరుమలరాయని, ఓబాంబికాపుత్త్రుఁడైన అచ్యుతరాయని బంధనప్రాపులను గావించితిమి. వారల నట్లుంచుట మనకు క్షేమకరముగాదు. వీరనరసింహదేవరాయఁడు మీకు ద్రోహము చేయఁదలంచినను మీరు మాత్ర మాతని కుమారునకు నపకారము చేయరాదు. అదియును గాక యతఁడు ప్రాణములు విడుచునప్పుడు తనకుమారుని నాకొప్పగించెను. ఆబాలుని సంరక్షించుట మీకు విధియై యున్నది. అచ్యుతరాయఁడు నిరపరాధి. అతనివలన నపకార మింతవఱకు జరిగినది లేదు. అయినను వారలను రాజధానీనగరమున నుంచుట అనేకానర్థములకు మూలమై యుండును. కావున వారలను రాజధానికి దూరమున భద్రముగా సంరక్షించుట కర్తవ్యము. వారి నుంచుటకుం దగినప్రదేశము చంద్రగిరిదుర్గమై యున్నది. అక్కడ వారల రక్షణకొఱకు సైన్యము నుంచి జీవనార్థము కొంతదేశము నిచ్చి స్వేచ్ఛగా మననిచ్చుట 'మీయౌదార్య బుద్ధికి వన్నెబెట్టినట్లుండును.