పుట:Thimmarusumantri.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ ప్రకరణము

41

"ముదిగల్లు, రాచూరుదుర్గములు మనరాజ్యమున కాయుస్థానములని మీరెఱుంగుదురు. అట్టి యాయుస్థానములను మనశత్రువు లాక్రమించి విజృంభించుచున్నారు. మఱియు హైందవసామ్రాజ్యవర్ధ నస్థిరనీతికరణకుశలుం డగు తిమ్మరుసు మంత్రి నేడు గాకున్న ఱేపైనను విజాపురరాజ్యమును తుదముట్టింపఁగలడు. అతఁడు బ్రాహ్మణమంత్రి ; మహారాజ్యతంత్రజ్ఞుఁడు; అప్రతిమానప్రతిభాశాలి. అతనితో సాటి వచ్చువాఁడు విజాపురరాజ్యమునం గానరాఁడు. నే నెవ్వనికి భయపడువాఁడను గాను కాని వాని కొక్కనికే భయపడవలసి వచ్చుచున్నది. ఇంక మన ముపేక్షించుట ప్రమాదహేతువు. ఎట్లయిన నాదుర్గములను స్వాధీనపఱచుకొన్నఁ గాని నాకు నిద్దుర పట్టదు. ఈ యపకీర్తి బాపుకొన్నఁగాని దక్షిణహిందూస్థానమునఁ దురుష్క రాజ్యములకుం గలప్రతిష్ఠ, క్షీణమైపోవును."

అని నొవ్వఁబలికి దండయాత్రకు సైన్యముల సన్నదము చేయవలసిన దని యుత్తరు వొసంగెను. అతనియాజ్ఞను సిరసావహించి యూవజీర్లు సైన్యాధిపతులకుఁ దెలియఁ జేసిరి. తుళువ సరసరాయఁడు రాజద్రోహులనడంచుటకై దక్షిణ దేశమునకుఁ బోయినసమయమున విజాపురసుల్తాను రాచూరుమండలముపై దండెత్తి వచ్చెను. అయినను తిమ్మ రుసుమంత్రి యూరకుండక యా సుల్తాను నెదుర్కొని తఱుముటకై నరసరాయని సోదరుఁడగు తిమ్మనాయకుని నియమించెను. [1] అతఁడు కొంత సైన్య

  1. హేమరాజు బాలరాజును వెంట నిడుకొని యుద్ధము చేసెననియు, హేమరాజు పాఱిపోయె ననియు, బాలరాజు గాయముల నొంది మార్గమధ్యమునందుఁజనిపోయె ననియు, ఫెరిస్తా వ్రాసెసుగాని హేమరాజును నరసరాయఁడనియు, బాలరాజును ఇమ్మడి నరసింహరాయఁ డనియుఁ గొందఱు చరిత్రకారు లూహించు చున్నారు. వారియూహలు సరియైనవి కావు. ఎందుకన. ఇమ్మడి నరసింగరాయలు క్రీ.శ. 1505 వఱకు బ్రతికియున్నట్టు శాసనములు గన్పట్టుచున్నవి. (ఎఫిగ్రాఫికా ఇండియాకాసంపుటము. 7-నం 8 రు శాసనము జూడుఁడు). హేమరాజనుపేరు తిమ్మరాజనుపేరునకు సంబంధించినది కాని నరసరా జనుపేరునకు పోలికగిలిగినది కాదు. ఇంతయగాక యీ యుద్ధము క్రీ. శ. 1493 వ సంవత్సరమున జరిగినట్లు ఫెరిస్తా వ్రాసియున్నాడు. ఆసంవత్సరమున నరసరాజు దివ్యక్షేత్రయాత్రార్ధము దక్షిణదేశమునకుఁ బోయినట్లును, తిరుచునాపల్లి మండలేశ్వరుడైన కోనేరునాథునితోఁ పోరాడి జయించినట్లును, కోనేరినాథుఁడు యుద్ధములో మృతినొందినట్లును అచ్యుతరాయాభ్యుదయ మనుసంస్కృత కావ్యమువలన విదితమగు చున్నది. కావున ఫెరిస్తా వ్రాసిన దంతయు సత్యము కాదు. ఆదిల్‌షాహతో యుద్ధము చేసి యోడి పోయినది. నరసరాయఁడు కాదు. అతఁడు నరసరాయని సోదరుఁడగు తిమ్మరాయఁడై యుండవలయు ననుట యథార్థమునకు దూరమైన విషయము కాదు.