పుట:Thimmarusumantri.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

తిమ్మరుసు మంత్రి


చుండెను. మహారాజ్యతంత్రజ్ఞుఁడైన తిమ్మరుసు శత్రురాజ్యములలో నన్యోన్యము మైత్రి లేకుండునటులు ప్రయత్నించుచుఁ దనసామ్రాజ్యమునందలి సామంతప్రభువర్గమునను, సేనాధిపతి వర్గమునను, మనస్పర్ధలు జనించి సామ్రాజ్యవినాశహేతువులు గాకుండ వేయికన్నులతో జూచుచు హైందవసామ్రాజ్యమును వీక్షింపుచుండెను. కాని దైవ మెల్లకాల మనుకూలుఁడై యొక్కరీతి నుండుట యసంభవము.

ఆదిల్‌షాహ పరివేదనము.

విజాపురరాజ్యమునకును విజయనగర సామ్రాజ్యమునకును నడుమ రాచూరుమండలము గలదు. ఈ భూభాగము కృష్ణానదికిని తుంగభద్రానదికిని నడుమ బలాఢ్యములైన ముదిగల్లు రాచూరుదుర్గములచే నలంకరింపఁబడి యుండెను. ఇది సామ్రాజ్యరక్షకత్వమునకై కవచముభంగి నుండుటచేత బహమనీ సుల్తాను దీని నెప్పుడును స్వాధీనములో నుంచుకొనవలయునని ప్రయత్నించుచుండెను. అట్లే విజయనగరసామ్రాజ్య సార్వభౌముఁడును స్వాధీనములో నుంచుకొనవలయు ననియే ప్రయత్నించుచుండెను. ప్రస్తుత మియ్యది విజయనగరాధీశ్వరునిచే నాక్రమింపబడియెనని యిదివఱకుఁ జెప్పి యున్నాఁడను. ఇంత ప్రముఖమైన భూభాగము శత్రువు రాక్రమించినందులకుఁ బరితపింపుచు విజాపురసుల్తాను తన వజీర్లతో నిట్లు పలికెను.