పుట:Thimmarusumantri.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ ప్రకరణము

13


యొకండు నాకీరాజ్యమునఁ గానరాడు. నేను వృద్ధుఁడనైతిని. నాకుందెలిసిన రాజనీతిశాస్త్ర మర్మముల నన్నిటిని మహారాజ్య తంత్రవిధానములతోడం గఱపి నిన్ను రాజనీతివిద్యావిశారదు నిగా నొనరింపఁ నీయందుఁ గల మమకారము నన్ను శతవిధములఁ బ్రేరేపించు చున్నది. నాయనా! ఒక్కమాట మనస్సునం దుంచుకొనుము. హైందవ ధర్మరక్షణార్ధమై స్థాపితమైన యీసామ్రాజ్యము వినాశము నొందకుండ మ్లేచ్ఛాక్రాంతము గాకుండఁ జూచుకొమ్ము. నీ జీవితకాలమున నీవొనర్పవలసిన విధ్యుక్తధర్మమిదియే యని యెఱుంగుము. నీ బొందిలో ప్రాణమున్నంతదనుక దీని మఱువకుము.

రాజకీయ పరిస్థితులు.

చెట్టు చెడుకాలమునకుఁ గుక్కమూతి పిందెలు పుట్టినటులు సంగమరాజవంశమున దౌర్భాగ్యులు పుట్టి హరిహరప్రౌఢ దేవరాయాది రాజ్యవర్యులు సంపాదించి పెట్టిపోయిన సామ్రాజ్యవైభవమును గ్రమముగాఁ గొల్పోవుచు దుర్వృత్తులంబడి దుర్బలులై యొండొరులం జంపుకొనుచు స్వేచ్ఛావిహారులై వర్తింపు చుండుటయు, ఒకవంక బెడందకోటసుల్తాను (Sultan of Beder) కర్ణాటసామ్రాజ్యమును గబళింపఁజూచుటయు, మఱియొకవంక నొడ్డెరాజగు పురుషోత్తమగజపతి విజయనగర సామ్రాజ్యముపై దండయాత్రలు సలుపుచు నుదయగిరి పర్యంతము భూభాగము నాక్రమించుకొని పరిపాలించుచుండు