పుట:Thimmarusumantri.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

తిమ్మరుసు మంత్రి


టఁయుదలపోసి యీనరపతి సామ్రాజ్యము దక్షిణహిందూస్థానమున వర్థిలఁజేయవలయునని బుద్ధిమంతుఁడును, బాహుబలశాలియు మహాయోధుఁడునగు నీసాళువ నరసింహ భూపాలుని నీ సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తునిగావింప దృఢసంకల్పుఁ డనై పదేండ్లుగాఁ బ్రయత్నించు చున్నాఁడను. బహమనీ సుల్తాను రెండవ మహమ్మదుషా దండెత్తివచ్చి గండికోట దుర్గమును ముట్టడించినప్పుడును, కళింగదేశాధీశ్వరుండైన పురుషోత్తమగజపతి కాంచీపురముపై దండెత్తి వచ్చినప్పుడును సాళ్వనరసింహుని సైన్యములు దలంపడి వారల నోడించి తఱుమునట్లు చేసితిని. సాళ్వనరసింహ భూపతిని కర్ణాట సామ్రాజ్యమున కంతకు నభిషిక్తుని గావింపవలయునని పెద్ద కోరికతోనున్న వాఁడను. ఈ సాళ్వనరసింహభూపాలుఁడు సర్వస్వతంత్రుఁడై పరిపాలనముఁ జేయుచున్నను విద్యానగరమున (విజయనగరము) సంగమ రాజవంశీయులు సింహాసనస్థులైయుండ నుపేక్షించి యూరకుండుట హైందవ సామ్రాజ్యమునకు క్షేమకరముగాదు. ఏవేళనో బలవంతులైన బహమనీ సుల్తానులు నోట వేసుకొందురను భయముగలదు. నేనొకవేళ నామహత్కార్యము నేఱవేర్చునంతవఱకు జీవించియుండుట తటస్థపడకపోయెనేని నీవా మహాకార్యమునకుఁ బూనుకొనవలయును. దీని నీవు వాగ్దత్తము చేసినయెడల నీకు రాజనీతి శాస్త్రీయ మర్మములన్నిటిని బోధించి ప్రధానమంత్రి స్థానమునకుఁ గ్రమముగా రప్పింతు" నని హెచ్చరించెను.