పుట:Thimmarusumantri.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

తిమ్మరుసు మంత్రి


ఇట్లైదాఱుసంవత్సరములు బహుకష్టపడి సంస్కృతాంధ్రభాషలయందు చక్కని పాండిత్యమును సంపాదింపఁగలుగుటయగాక గొప్ప వ్రాయసకాండ్రుకూఁడనైరి. ఇంతియ గాక శాస్త్రము లభ్యసించుటకై పండితులుండెడి స్థానములకుఁ బోయి వారల నాశ్రయించి వారలకు శుశ్రూషలు గావించి శాస్త్రాభ్యసనము గూడఁ గావించిరి. సుప్రసిద్ధగణకులకడ కేఁగి రెండుమూఁడు సంవత్సరములు గణితశాస్త్రమునందుఁ గృషిచేసి ప్రావీణ్యమును సంపాదింపఁగలిగిరి. అతిసూక్ష్మబుద్ధి కలవాఁడగుటచేత తిమ్మన గోవిందునికంటెను మేధావియై వన్నె కెక్కుచుండెను. తనబుద్ది సూక్ష్మతచేత తిమ్మనార్యుఁడు ప్రపంచములోని వస్తుతత్త్వమును బాగుగా గ్రహింపుచుండెను. ఎప్పుడీతఁడు నెక్కడకుఁ బోయినను మనుష్యస్వభావమును గ్రహించుటకే ప్రయత్నము సేయుచుండెను. అరణ్యమునకుఁ బోయిన వివిధజాతివృక్షముల తత్త్వములను గ్రహింపుచుఁ దెలియనివానిఁగూర్చి, దెలిసిన వారి నడిగి తెలిసికొను చుండెను. ఇట్లే జలచరములు, చతుష్పాదజంతువులు, మొదలగువాని యొక్క స్వరూపగుణ స్వభావభావముల గుర్తింపుచు నాతఁ డెంతయో విజ్ఞానమును సంపాదించెను.

"శరీరమాద్యం ఖలు ధర్మసాధన" మ్మని యెప్పుడును శరీరారోగ్యమును గాపాడుకొనుచు దృఢకాయులుగ నుండవలయునని నిరంతరమును దేహపరిశ్రమ చేయుచుండిరి. ఆంధ్రకర్ణాటకులలో నుండు నానాజాతిసాంప్రదాయచరిత్రముల నేర్పుతోఁ