పుట:Thimmarusumantri.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ ప్రకరణము

9


భక్తివిశ్వాసములు చూపుచుండుట యాతనియదృష్ట మని చెప్పఁదగియున్నది. అన్నమాట తమ్ముఁ డెన్నఁడును జవదాటి యెఱుఁగఁడు. అందువలన నాసోదరులిరువురును రామలక్ష్మణులవలె నన్యోన్యానురాగముతో ప్రవర్తింపుచు విద్యాభ్యసనమునకు దొరకొనిరి. అన్నదమ్ములిరువురు ప్రతిదినమును సూర్యోదయమునకు ముందుగాలేచి కాల్యకరణీయంబులు దీర్చుకొని, సువర్ణముఖికిఁబోయి, స్నానసంధ్యాద్యనుష్ఠానంబులు నిర్వర్తించుకొని, ప్రాతఃకాలమున నుపాధ్యాయులకడకేఁగి, కావ్యపఠన మొనరించి, సూర్యుఁడు నెత్తికి దిన్నఁగా మింట వెలుంగువేళ సోదరులలోనొకరు మాధుకరమునకై బయలుదేరి కొంత ప్రసాదమును సంపాదించుకొని వచ్చిన పిమ్మట నిరుపురును గలిసి భుజింపుచుందురు, భోజనముచేసి కొంతవిశ్రాంతి గైకొన్న మీఁదట దస్తూరి కుదుర్చుకొనుటకై గంటములతోఁ దాటాకులమీఁద వ్రాయుచుందురు. తరువాతఁ గొంతసేపు తెలుగు కావ్యపఠనమొనరించి, పిమ్మట రాజకీయోద్యోగుల కడకేఁగి వారల నాశ్రయించి వారలకు వినయవిధేయులై వారు నియమించినషసులను గావించి, సాయంకాలమైనతరువాత, పర్వతములు, చెఱువులు, నదులుగల ప్రదేశములకు వాహ్యాళి వెడలి, ప్రకృతి సౌందర్యమును దిలకింపుచు నానందించు చుందురు. అటుపిమ్మట నింటి కరుదెంచి రాత్రిభోజనమైనతరువాతఁ గొంతసేపు భారతకథలనుగాని, రామాయణకథలనుగాని పూర్వరా జన్యచరిత్రలు మఱియేవియైనగాని పెద్దలవలన వినుచుందురు.