పుట:Thimmarusumantri.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

తిమ్మరుసు మంత్రి


మార్గమునే యవలంబించి కృష్ణరాయఁడుకూఁడ తనయాముక్తమాల్యద యందు వీరవైష్ణవుఁడై వైష్ణవ మతపక్షపాతము నెంతచూపించినను కార్యాచరణమున సమభావముతోనే ప్రవర్తించెను. శైవులను, వైష్ణవులను సమదృష్టితోనే జూచెను. వీరినిమాత్రమేగాదు. జైనులపట్లగూడ సహనమువహించి జైనపండితులఁగూడ నాదరించుచు వచ్చెను. ఇట్లు హిందూ జైనమతములు మాత్రమేగాక క్రైస్తవ మహమ్మదీయ మతములుగూడ వ్యాప్తములగు చున్నను తిమ్మరుసు మంత్రి శత్రుత్వమును బూనియుండలేదు. తన సైన్యములోఁ గొందఱు మహమ్మదీయులనుగూడఁ జేర్చుకొని వారి యుపయోగార్థము విజయనగరమున నొక మసీదునుగూడఁ గట్టింపించి యిచ్చెను. అందువలన తిమ్మరుసు కాలమున రాజ్యపరిపాలనము సర్వజన సమ్మతమై యుండెను. పాశ్చాత్యులైన పోర్చుగీసువారితో నెప్పుడును విరోధము పెట్టికొని యుండలేదు.

గోవాపరిపాలకులను గారవముతోఁ జూచుచువచ్చెను. ఆబాలవృద్ధులు తిమ్మరుసునకు వినయవిధేయులై వర్తించిరి. విదేశములతోడి వ్యాపారము విస్తరింపఁజేయబడినది. సామ్రాజ్య విభవమపారమైయుండెనని పాశ్చాత్యుల వర్ణనములనే ప్రత్యక్ష సాక్ష్యముగాఁ జూపవచ్చును. ఏసమయమునందయినను అవసరమైనయెడల ఇరువదిలక్షలసైన్యమును సమకూర్చుట కనువు గల్పించెను. వేయునేల? తిమ్మరుసుమంత్రిలేనియెడ కృష్ణదేవ