పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

‘ఆ సందేహమేదో చెప్పండి.”

'సర్కార్ ! నైజాముల్ముల్కు గారిని, వారి సోదరులను కౌరవులుగా వర్ణించితిమి. తాము పాండవులని వ్రాసితిమి. పాండవులైదుగురు సోదరులు. ఆయైదుగురకు భార్య ద్రౌపది. తాము ధర్మరాజని వ్రాసితిమి. తమ జనానా వారిని ద్రౌపదిగా వ్రాసినాము అయితే తమ జనానావారికి భీమార్జున నకులసహదేవులనెడి మిగత నలుగురు భర్తలుగ నెవరిని వ్రాయవలయునో తోచకున్నది. ఈ విషయమై తమరెట్లు సెలవిచ్చిన నట్లు వ్రాయుదుము.'

ఏదులశాహి నాపాదమస్తకము క్రోధమనలముభంగి దహించెను. 'ఛీ తూ! అరే ఏం భారతంబే మీది, ఒక్క ఆడదాన్కి అయిదుగురు మొగుళ్ళు, మాజనానాకింకా నల్గురు మొగుళ్ళు కావాలీ హైతో మీభారతం అంకితమువద్దు కంకితమువద్దు వెంటనే తగులబెట్టు'డను సరికి రామకృష్ణుడు 'చిత్తము సర్కార్ ! అట్లే చేయించెద'నని యా వేయిబండ్ల తాటియాకును నిశ్శేషముగఁ దగులఁ బెట్టించెను. అంతయు భస్మీభూత మయినపిదప నేదుల శాహికడ కతడేగి 'సర్కార్ ! తమ యాజ్ఞానుసారము తగులబెట్టించితిని అనెను. ఏదులశాహి పరమానందము నొంది, యాపండితులకు శ్రమయిచ్చి నందులకు నొచ్చుకొని పెక్కు బహుమానములిచ్చి వీడ్కొలిపెను. రాయ లిదియంతయుఁ దెలిసికొని కడుపు చెక్కలగు నట్లు నవ్వెను,


10 కుంకుమబొట్లు

చేర దేశమునుండి కుంకుమబొట్లు అనుజగదేకవిఖ్యాతినార్జించిన పండితుఁడు రాయల యాస్థానమందలి యష్టదిగ్గజములను జయించు తలంపుతో నేతెంచెను. అతఁడు రాయలను సందర్శించి యాస్థాన విద్వాంసులతోడి వివాదమునకుఁ దన కవకాశమిమ్మని కోరగా,