పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[3]

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

17


ఇందుల కంతగా విచారింపవలయునా? ఏమివెర్రి? మీరు నిర్విచారులై యుండిన నేను జెప్పినట్లు చేయుడు. మీమర్యాద నామర్యాద గూడ దక్కింతును. వేయిబండ్ల తాటియాకు కొట్టించి, సంచికలుగా దయారు చేయింపుఁడు అనెను. పెద్దన సంతోష భరితాంతరంగుడై యట్లే చేయించెను.

ఏడవరోజున రాయల సెలవుగొని, రామకృష్ణుడు పెద్దనాది కవీంద్రులందఱితోఁ గలిసి, విజాపురమునకు బోయెను. కవుల నపరిమితముగ గౌరవించి, ఏదులశాహి భారతము కృతినొందుట కువ్విళ్ళూరుచుండెను. ఒకనాటి యుదయమున నాతడు కవులను రావించి సుఖాసనాసీనులగావించి యిట్లు ప్రశ్నించెను -

'పండితులారా! భారతం రచించి తెచ్చినారా!'

'రామకృష్ణుడు లేచి యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

'సర్కార్ ! తమ హుకుం ప్రకారము పూర్తిచేసి తెచ్చినారము వ్రాయుట వారమురోజులలోఁ బూర్తియైనదిగాని చదువుట కధమమొక సంవత్సర మగును.'

'మమ్ము పాండవులుగనే వర్ణించినారా?'

'అవునట్లే వర్ణించినాము'

'మాశత్రువగు నైజాముల్ముల్కునో—'

'కౌరవులుగా వర్ణించినాము'

'అచ్చా! చాల సంతోషముగా నున్నది. అయితే ఎప్పుడు మొదలు పెట్టదరు?'

'కాని ప్రభూ! ఒక్క సందేహముతోచి, చిట్టచివర కొంత పూర్తిచేయకుండ యుంచినాము. మాటిమాటికి మాకా సందేహము కలిగి చాలచోట్ల నేమియు వ్రాయక యట్లె యుంచినారము. ఆ సందేహము నివృత్తి చేసినచో నరగంటలో బూర్తిచేసి, వినిపింతుము.'