పుట:Telugu merugulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

69


చెలికత్తె సత్యభామతో జరిగిన విషయముఁ జెప్పుటచేత సత్యభామ కోపము, శ్రీకృష్ణుని యనునయము, భూలోకమునకుఁ గల్పవృక్షమును బెఱికి కొనివచ్చునట్లు ప్రతిజ్ఞ సేయుట, స్వర్గగమనము ద్వితీయాశ్వాసే తివృత్తము.


తృతీయాశ్వాసమే తృతీయాంకము. స్వర్గవీథులలో శ్రీకృష్ణుని పయనము, ఇంద్రసత్కారము, ఇంద్రుని హజారమునఁ గాక శ్రీకృష్ణుఁ డదితిహజారమున విడియుట, శ్రీకృష్ణసత్కారాదికము, సత్యాశ్రీ కృష్ణుల వనవిహారాదికము నందలి కథాంశము.


చతుర్థాశ్వాసమే చతుర్థాంకము, పారిజాతోత్పాటనము, ఇంద్ర శ్రీకృష్ణసంగరము నిందలి కథాంశము.


పంచమాశ్వాసమే పంచమాంకము. సత్యభామ తన విభునిచే పారిజాతమును భూలోకమునకుఁ గొని తెప్పించి ద్వారకానగరమునం బ్రతిష్ఠించుట సత్యభామ పుణ్యకవ్రతము చేయుట-సత్యభామ శ్రీకృష్ణుని నారదునకు దానమిచ్చుట-పారిజాత పుష్పములను శ్రీకృష్ణుని పత్నులకు, ద్వారకావాసుల కెల్లరకునుగూడఁ బంచిపెట్టుట శ్రీకృష్ణుఁడు భూలోకమున నుండునంత దాఁక కల్పవృక్షము భూలోకమున నుండున ట్టేర్పాటగుట భూలోకవాసులకు సర్వసౌఖ్యములు సమకూడుట యిందలి కథాంశము. దీనిని నాటకముగా 'నారదవిజయ' మని కాని, 'శచీగర్వభంగ' మని కాని పేర్కొనఁదగును. నారదవిజయ మనుటయే యెక్కువ సంగతము విష్కంభాదిగా నేను జెప్పిన యీ కథాసూత్రమెల్ల నందితిమ్మనార్యుండీ ప్రబంధమున గుర్తింపఁదగినట్లు సూచించియే యున్నాఁడు. నరకాసురు నోడించి స్వర్గమును దనవల్లభునకుఁ గైవస మొనర్చిన సత్యభామమహోప కృతిని మఱచిన శచీదేవికి నారదుఁడు కల్పించిన గర్వభంగమిది! కథామధ్యమున,