పుట:Telugu merugulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

తెలుఁగుమెఱుంగులు


యనుజ్ఞ వడయుటకై యచటికి వెళ్లెను. అప్పుడు శచీదేవి కల్పవృక్షపు దివ్యకుసుమములను గోయించి తెప్పించి పార్వతీసరస్వతీరతిదిక్పాలక పత్నీప్రముఖ దివ్యాంగనల కాపుష్పములను పంపకములు పెట్టి పంపు చుండెను. కడమపుష్పములను దేవేంద్రునిహజారమున శయ్యకు నలంకారముగాఁ బెట్టించుచుండెను. అపుడు సన్నిహితుఁడైయున్న నారదునికిఁగూడ దేవేంద్రుని ప్రేరణమున శచీదేవి యొకపుష్పము నొసంగెను. ఆ పుష్పము నతఁడు 'శ్రీకృష్ణార్పణ మస్తు' అని గ్రహించి భూలోకమునకుఁ బోవుచుంటి నని విన్నవించుకొనెను. దేవేంద్రుఁ డది విని శ్రీకృష్ణునకును, నాతని దేవేరులకును జాలినన్నీ పుష్పముల నీయ శచీదేవిని గోరెను. శచీదేవి యివి దివ్యకుసుమము లనియు, వీని ధరింప దివ్యులేకాని భూలోకవాసు లనర్హులనియు నీ పుష్పముల గౌరవము నిల్పు టావశ్యక మనియు, భూలోకవాసుల కివి నాచేతి మీఁదుగా నొసంగ ననియు నీసడించి పలికెను. నారదుఁడు సత్యభామ పేరెత్తి యేమో సణుగుకొనుచు హజారమును వీడి భూలోకమునకు విచ్చేసేను. ఇది విష్కంభరూపప్రథమాంకపూర్వకథ.


పారిజాతాపహరణముస, బ్రథమాశ్వాసము ప్రథమాంకము. శ్రీకృష్ణుఁడు రుక్మిణియింట వినోదించుచుండుట, యపుడు సత్యభామ చెలికత్తెగూడ నచట నుండుట, నారదునిప్రవేశము, పారిజాత పుష్ప సౌభాగ్యవర్ణనము, శ్రీకృష్ణున కాపుష్పము నొసఁగుట, శ్రీకృష్ణుఁడు నారదసూచనలఁబట్టి కథారహస్య మెల్లఁ గనుగొనుట, నారదుని కనుసైగ చొప్పున రుక్మిణి కొపుష్పము నిచ్చుట - యిత్యాదికము కథావస్తువు. ద్వితీయాంక కథావస్తువుగూడ నిందుఁ గొంత గలసియున్నది.