పుట:Telugu merugulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

తెలుఁగుమెఱుంగులు


శాంత్యానుశాసనిక పర్వములలోని కథాకల్పనములుఁ గావ్య శిల్పదృష్టితో జూడఁగా నౌచితిదూరము లగును. కాశీఖండమున నొకచోటఁ బతీవ్రతా ధర్మములు చెప్పుట పరమార్ధముగాఁ గొనుటచే లోపాముద్రతో వ్యాసుఁ డుపన్యసించుటలో నౌచితీభంగము పొటిల్లినది. ఇట్టివానిని బురాణములు దెలిగించువారు తొలఁగించుకొన వీలు కాదయ్యెను. కావ్యమున కౌచితి జీవగఱ! కావ్యమునకే యేమి? లౌకికమయిన సర్వవాగ్వ్యహారమునకును నౌచితి ముఖ్యమేకదా! దీనిని బాటించుటకుఁ గవికి స్వాతంత్ర్యముండ వలెను. అందుకే శాకుంతలాది నాటకములయందుఁ బురాణకథలకు మారులును, దద్రక్షకై 'అన్యథా వా ప్రకల్ప్యయేత్' అన్నశాస్త్రమును నేర్పడినవి. ఆంధ్రకవితాసంప్రదాయము ప్రాయికముగా సంస్కృతప్పు దీరు ననుసరించి పుట్టినది గాన సంస్కృతమునఁ బురాణములకుఁ దర్వాత వెలసిన కావ్యనాటకముల యవతార మాంధ్రమునకును నావశ్యకముగాఁ గవులకుఁ దోఁచెను. ఆ తలఁపు చొప్పుననే నన్నిచోడ కుమారసంభవ, కేయూరబాహుచరిత్ర, క్రీడాభిరామ, హరవిలాస, శృంగారనైషధ, శృంగార శాకుంతల, ప్రబోధచంద్రోదయాదు లాంధ్రమున వెలసినవి. మహాకావ్య పద్ధతిని వెలసిన కుమారసంభవ, శృంగారనైషధాదులుగాక నాటక పరివర్తనము లనఁదగిన కేయూరబాహుచరిత్ర, క్రీడాభిరామ, శృంగార శాకుంతలాదులు గూడ శ్రవ్యములుగానే, చంపూకావ్యములుగనే తెలుఁగున రచితములైనవి. నాటకములయందు వచనభాగ మెక్కువగా సంభాషణాత్మకముగా నుండును, సరిగా వానినీ దెలిగించుటలోఁ బొడిపొడి వచనము లట్లే తెలిగింపవలసియుండును. ప్రాచీనకాలమున దేశభాషా రచనలలో వచనరచనమీఁద నాదరము లేకుండెను. అందు రచనాశిల్ప మంతగా నుండ దని యప్పటివారి తలఁపుగాఁబోలును! నియమబద్ధములు గాని పొడివచనరచనలు తాళపత్రాదిలిపులలో వికృతిఁజెందకుండ