పుట:Telugu merugulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

ఆంధ్రకవిత-ప్రబంధయుగము


ఆంధ్రకవితాకలా కాల రత్నహారమున శ్రీకృష్ణదేవరాయల కాల మొక తరళ రత్నము. ఆ మహారాజు సుకృతవిశేష మెట్టిదో కాని, యాంధ్రకవిత యతని పాలనకాలమున దివ్యవైభమనుభవించినది. దివ్య సౌందర్యము తీర్చుకొనినది. తిన్నని తీరుల దిద్దుకొనినది. ఔచితీ నిర్వాహ మలపఱచుకొనినది. సంస్కృతమునందుఁగాని, సాటి భాషలగు కర్ణాట ద్రవిడములందుఁ గాని కానరాని కావ్యవస్తుకల్పనపు మెల్పులను గల్పించుకొనినది. విక్రమార్కుని యాస్థానిలో నవరత్నము లున్నట్లు శ్రీకృష్ణదేవరాయని యాస్థానియం దష్టదిగ్గజము లనఁబడెడు కవులు వెలసి, 'నభూతో నభవిష్యతి' యనఁదగినట్లు వింతతీరున మహాప్రబంధములు విరచించిరి. ఆనాఁటి కృష్ణరాయఁ డాంధ్ర కవిరత్నరత్నాకరుఁడు. ఆ మహారాజు దక్షిణ హిందూదేశమునకెల్ల నేకచ్ఛత్రాధిపత్యము వహించి యటు కటకముననుండి యిటు కన్యాకుమారి దాఁకఁ గల దేశమెల్ల విజయయాత్రలోఁదిరిగి చూచినవాఁడు. కాన తనతిరిగిన దేశములలో గానవచ్చు కవిరత్నములనెల్ల 'రత్నహారీతు పార్ధివ' యన్న న్యాయము చొప్పునఁ గొనితెచ్చికొనెను. కృష్ణాతీరమున సద్దంకి నుండి మాదయగారి మల్లనను, కడపమండలముననుండి పెద్దనామాత్యుని, నెల్లూరిమండలమున నుండి నందితిమ్మనను, గుంటూరిమండలముననుండి పింగళి సూరన్నను, తెనాలి రామలింగని, నింక ననేకమండలములనుండి యనేకకవులను నార్జించి, తనసాహితీసభాంగణము నలంకరించుకొనెను. 'సాహితీ సమరాంగణ సార్వభౌముఁ" డనఁబరగెను.