పుట:Telugu merugulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

తెలుఁగుమెఱుంగులు


ఇందు 'ఈకంత' అనుచోఁ గొందఱు వికటార్ధములనుగూడఁ జెప్పుదురు. ఇక్కడ 'ఒక్కంత కృపావిహీనమతి నాతడు నేచునె యన్నదమ్ములన్' అన్న పాఠము సుందరము. ఇంతవఱకు నే నిప్పుడు వెల్లడించిన సంస్కరణ ములలో నిదియొక్కటి తక్క దక్కిన వెల్లను తిక్కన హృదయము నూహించి నేనే చేసినవికాని వ్రాతప్రతులఁజూచి చేసినవి కావు. ఈ తీరునఁ జూడఁగా చేసి తెలుగు మఱుఁగులలో సాటిలేని నేర్పుతో మెలఁగనేర్చిన తిక్కన సారస్వత భాండారమగు భారతభాగమును ససిగా నుపయోగించు కొనుటకు సమర్ధమైన సహృదయపండిత గోష్ఠి జరగవలెను. ఇట్టి పరిశీలనము జరుగనిచోఁ దిక్కన పదప్రయోగలాలిత్యము సరిగా బరిజాతము కాజాలదు.

తిక్కన రచనలో నింకొక వింతతీరు కూర్పును వివరించుచున్నాను. ఆంధ్రకవితారచనమున వాక్యముల నసమాపకములుగా పద్యముననుండి పద్యమునకు సాగునట్లు కూర్చుట కలదు. అనఁగా నొక వాక్యము రెండు భిన్న పద్యములలో ననుగతమై యుండు నన్నమాట. పద్యావసానమునకుఁ బద్యోపక్రమమునకు నడుమఁ గొంతవిశ్రాంతి యుండును. ఒక వాక్య ముచ్చరించునపుడుగూడ సడుపు విశ్రాంతి యుండఁదగుసు గనుక ఆకూర్పు అసందర్భముగాఁ దోఁపదు. కాని రెండు భిన్న జాతివియగు పద్యములలో నొకసమాసపదమునే సంధించి కూర్చుట చాల విడ్డూరముగా నుండును. ద్విపదములు, రగడలు మొదలగువానిలోను, మాలికావృత్తముల లోను నాల్గుచరణములకుఁ బద్యము ముగియదు కాన వానిలో నట్లుండవచ్చును గాక, భిన్నజాతిపద్యముల యవసానారంభములలోనే ప్రధానముగా సంహిత పాటింపవలసిన సమాసపదము తిక్కన రచనలో నున్నది.