పుట:Telugu merugulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

ఆంధ్రకవిత-పురాణయుగము

నన్నయతిక్కనలు

పురాణముల రచనము, ఆ రచనముల చెల్లుబడి ప్రబలముగా సాగిన కాలఖండమును పురాణయుగ మని వర్తమానులు వ్యవహరించుచున్నారు. అటువంటి కాలఖండములను యుగము లనుటకంటె శకము లనుట వ్యవహారార్థానుగుణ మనుకొందును. ఇట్లు మార్చిన పురాణశకము, ప్రబంధశకము అని కాని, మటొకవిధమున కవులనుబట్టి పేర్కొన్న నన్నయశకము, తిక్కనశకము అని కానీ అనుట యవును. అందఱును ఇప్పుడు యుగ' మనియే వ్యవహరించుచున్నారు గాన నేనును అలాగే అనుచున్నాను. ఆంధ్రపురాణరచన సంస్కృతపురాణరచనానుసారిగా సాగినది గాన ఆంధ్రరచనాపద్ధతిగ వివరించుటకు ముందు సంస్కృత సంప్రదాయానుస్మరణము కౌంత ఆవశ్యకమే అవును. సంస్కృత పురాణములు తద్రచనాకాలమునాఁటి విద్వద్విజ్ఞానమునకు సర్వస్వములు. వేదములలో సర్వవిద్యలును అంకురప్రాయములుగా ఉండఁగా పురాణములలో అవి కొంత కొంత విరివిగా వెలసే ననవచ్చును. “సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ, వంశానుచరితం చేతిపురాణం పంచ లక్షణమ్" అని సృష్టి విధము, ప్రళయముల తీరు, రాజవంశముల చరిత్రలు, మన్వంతరకథలు, మహర్షుల చరిత్రలు మొదలగువానితో పురాణము లుండునని లక్షణము ఉన్నను, పురాణములలో ఇంకను ఎన్నో దేశచరిత్రలు, వైద్యము, జ్యోతిషము, నీతి, ధర్మ కామశాస్త్రములు, వ్యాకరణాలంకార సాహిత్యాది శాస్త్రసంప్రదాయములు మొదలయినవి కొంతకొంత సంగ్రహము గాను, కొన్నిచోట్ల విరివిగానుకూడ వర్ణితములై ఉన్నవి. అగ్నిపురాణములో వ్యాకరణము, వైద్యము, జ్యోతిషము మొదలయిన వెన్నియో ఉన్నవి.