పుట:Telugu merugulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

తెలుఁగుమెఱుంగులు


దిద్దితీర్చుట పువ్వును నలిపి వాసన చూపించుటవంటి దనియు 'సంకీర్తనలక్షణ' మను లక్షణగ్రంథములో వా రిట్లు చెప్పినారు.

 "పల్లవనారీమ్లేచ్ఛా
ద్యుల్లాసమనోజ్ఞ బంధురోక్తులు చవులై
చెల్లును గ్రామ్యములైనను
హల్లీ సకముఖ్యనాటకాదికఫణితిన్.

జగతిఁగల చెల్లుబళై,
సగిన భాషించునట్టి నానుడిపలుకుల్
తగ దన రహి చెడుఁ బువ్వుల
సొగసుడుగ బిసిగి కంపు చూపినభంగిన్."


ఈ లక్షణముచొప్పున యక్షగానములను నాటక ప్రభేదములలో ఉండు దేశిచ్ఛందోరచనావిశేషములను పేర్కొనుట కిక్కడ చోటు చాలదు. ఇంకను వాడుకభాషలో, ద్విపదలలో కాటమరాజు కథ, పల్నాటి కధ, కుమార రామునికథ, మణి క్రొత్తతరపుఁబదములయిన బొబ్బిలి కధ, దేశింగు రాజుకథ, లంకాసారథి మొదలయిన రసవద్రచనలు ఎన్నియో ఉన్నవి.


దేశము నలుముఖములను గాలించి మంచి మంచి పలుకు బళ్ళను, కథలను, సామెతలను, పాటలను, పదాలను, వింతశబ్దజాలములను సేకరించవలెను. అచ్చు రాకముందు అన్నిరకాల రచనలు తాటాకులమీఁ దను, నోటివాడుకలమీఁదను నెలకొని ఉండెడివి. అచ్చువచ్చిన తరువాత ప్రాయికముగా బ్రౌఢకావ్యరచనకే పరిపోషము కలుగుటచేత, ప్రాతకాలపు దేశిరచన లెన్నో అడగారిపోఁ జొచ్చినవి. ఆంధ్రభాష యందచందములు సరిగా గుర్తించుటకు వీని సర్వే యత్యావశ్యకము.