పుట:Telugu merugulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

తెలుంగుమెఱుంగులు


ఎందుకు పాటించినారా అని సందేహించుచుండువాఁడను. అర్వాచీనకవులు దీనిని అందుకనియే విడిచిపెట్టినారు కొఁబోలును. ఒకనాఁడు మాయింటిలో మా అమ్మగారు ప్రాతఃకాలపుపాట లేవో పాడుచుండగా వినుచున్న నాకు అందొక పాటఫణితి చాల ఆనందజనక మయినది. నేఁటి కావ్యరచనల కనుకూలింపఁ జేసికొంద మని గణవిభజన చేసి చూతునుకదా అది మధ్యాక్కలు లక్షణము కలదయి యున్నది. మధ్యాక్కల పఠసఫణితి నా కపుడు తెలియవచ్చినది. దానిమాదిరి చూపుచున్నాను, చూడుఁడు

"అంతట రాములవారూ - అంగన సీతను గూడి
సంతసమందుచు వేగా - స్వపురమునకు చనుదెంచీ
తమ్ములతోడను గలసీ - నెమ్మది రాజ్యములేలే
ధర్మముతో ప్రజలెల్లా - తామరతంపరలైరీ".

ఇందు రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణములు, ఒక సూర్యగణము - వెరసి ఆఱు గణములు కలది ఒక చరణము. మూఁడవ గణము కడపట సీసచరణదళమువలె మధ్యాక్కలు చరణము మధ్యకు విఱుగును. ఆదికాలపు కవులు పాటించిన సీస ద్విపద గీత పద్యములు కొంచెము మార్పులు చెందియు, చెందకయుకూడ స్త్రీబాల పురాదులు పాడుపాటలలో, పదాలలో నవచ్చుచున్నవి. స్త్రీలు పాడు శ్రావణ మంగళ వారపు పాట సీసపద్యమే.

శ్రావణామాసాన శుద్ధ పాడ్యమినాఁడు
మహలక్ష్మి ముత్యాల చీర గట్టి"

అని దాని మొదటి చరణము. మఱియు ద్విపద అను ఆదికాలపు రచన అనేక ఫణితి ప్రభేదాలతో పాటలలో, పదాలలో చేరియున్నది. ఒకటి రెండు ద్విపదఫణితి ప్రభేదములు చూపుచున్నాను.